తిరువనంతపురం: మలబార్ ఎక్స్‌ప్రెస్ లో ఆదివారం నాడు ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.

కేరళ రాష్ట్రంలోని వర్కాల రైల్వే స్టేషన్  సమీపంలో మలబార్ ఎక్స్‌ప్రెస్ లోని లగేజీ వ్యాన్లలో అగ్ని ప్రమాదం చోటు చేసుకొంది.   రైలును నిలిపివేసి మంటలను ఆర్పారు.రైలు ముందు భాగంలోని ఉన్న లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి.  

ఈ మంటలను మొదట గేట్ కీపర్ గుర్తించాడు. వెంటనే అధికారులను అప్రమత్తం చేశాడు.  మంగుళూరు నుండి తిరువనంతపురం వెళ్లే రైలు పరపూర్-వర్కాల స్టేషన్ల మధ్య ఉండగా ఈ ఘటన చోటు చేసుకొందని రైల్వే శాఖ అధికార ప్రతినిధి తెలిపారు.

మలబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లో ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు ఈ ఘటన చోటు చేసుకొందని అధికారులు  చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన బోగీని ఇతర బోగీలతో విడదీశారు. 

30 నిమిషాల్లో ఫైరింజన్లు, రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.మంటలను ఆర్పివేసిన తర్వాత రైలును తిరిగి నడిపించారు.  ఈ ఘటనలో రైలు రాకపోకలకు కొంత సేపు అంతరాయం కలిగింది. తిరువనంతపురానికి వెళ్లే పలు రైళ్లను పలు ర్వైల్వే స్టేషన్లలో నిలిపివేశారు.