ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ తమిళమే మాట్లాడుతామని.. రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఆయన స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ (narendra modi) ఎదుట తమిళనాడు సీఎం స్టాలిన్ (stalin) సంచలన వ్యాఖ్యలు చేశారు. ద్రవిడ పాలన మోడల్ దేశానికి చూపిస్తామని.. తమిళనాడులో (tamilnadu) తమిళమే మాట్లాడుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రాలకు నిధులివ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి అని స్టాలిన్ వెల్లడించారు.
అంతకుముందు చెన్నై చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి విమానాశ్రయంలో స్వాగతం పలికారు. రవితోపాటు తమిళనాడు మంత్రులు తురైమురుగన్, కేఎన్ నెహ్రూ, ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిసామి స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో అడయార్‌లోని ఐఎన్‌ఎస్ నేవల్ బేస్‌కు చేరుకున్న ప్రధాని మోడీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెహ్రూ ఇండోర్ స్టేడియానికి చేరుకున్నారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో పలు ప్రాజెక్టులకు మోడీ శంకుస్థాపన చేశారు.
అనంతరం.. ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. దీనికి వేలాది మంది తరలివచ్చారు. చెన్నైలో ఈరోజు రూ.31 వేల కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన అభివృద్ధి పనులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక శ్రేయస్సును మెరుగుపరచడంలో సహాయపడతాయి.
మరోవైపు.. ప్రధాని మోదీ చెన్నై పర్యటనలో హైడ్రామా చోటు చేసుకుంది. మోదీ సభకు వేదికైన నెహ్రూ ఇండోర్ స్టేడియంలో అటు డీఎంకే మద్దతుదారులు , ఇటు బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రధాని మోదీ జిందాబాద్ అని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేయగా .. దళపతి జిందాబాద్ అంటూ డీఎంకే కార్యకర్తలు నినాదాలు చేశారు.
