మకర సంక్రాంతి పర్వదినం కావడంతో ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమలలో అయ్యప్ప మకర జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఆయన దర్శనం కోసం భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు.

దీనికి తెరదించుతూ ఆలయానికి ఈశాన్య దిశలో పర్వతశ్రేణుల నుంచి జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో లక్షలాది మంది భక్తులు పులకరించిపోయారు. అయ్యప్ప శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగిపోయాయి.

కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి భగవంతునికి హారతి ఇస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అంతకుముందు పందాళం నుంచి తీసుకువచ్చిన తిరువాభరణాలను అర్చక స్వాములు అయ్యప్పకి అలంకరించారు.

అనంతరం మూలమూర్తికి మంగళ హారతి ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే చీకట్లను తొలగిస్తూ పొన్నాంబలంమేడు పర్వతి శిఖరాల్లో జ్యోతి దర్శనమైంది.