Asianet News TeluguAsianet News Telugu

హిమాచల్‌ ప్రదేశ్‌లో బీజేపీ వైపే మొగ్గు.. మెజారిటీ మాత్రం తక్కువే.. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ మాట ఇదే..!

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు బీజేపీ వైపు చూశారని స్పష్టం చేస్తున్నాయి.

Majority exit polls BJP likely to Retain Power in Himachal Pradesh
Author
First Published Dec 5, 2022, 7:11 PM IST

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ హిమాచల్ ప్రదేశ్ ఓటర్లు బీజేపీ వైపు చూశారని స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీజేపీల మధ్య క్లోజ్ ఫైట్ ఉన్నప్పటికీ.. కాషాయ పార్టీ మెజారిటీ మార్కును అందుకుంటుందని వెల్లడిస్తున్నాయి. 68 స్థానాలు ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో అధికారం దక్కించుకోవాలంటే.. 35 మెజారిటీ మార్క్‌ను సాధించాల్సి ఉంటుంది. అయితే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ.. 34 నుంచి 39 మధ్యలో స్థానాల్లో విజయం సాధిస్తుందని.. తిరిగి అధికారాన్ని నిలుపుకుంటుందని అంచనా వేస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఆప్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాయని పేర్కొన్నాయి. ఇక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 8న జరగనుంది. 

ఎగ్జిట్ పోల్స్ వివరాలు.. 
జన్ కీ బాత్- బీజేపీ (32-40), కాంగ్రెస్ (27-34), ఆప్ (0)
రిపబ్లిక్ టీవీ- పీ మార్క్- బీజేపీ (34-39), కాంగ్రెస్ (28-33), ఆప్ (0-1)
టైమ్స్ నౌ-ఈటీజీ- బీజేపీ (34-42), కాంగ్రెస్ (24-32), ఆప్ (0)
జీ న్యూస్- బార్క్- బీజేపీ (35-40), కాంగ్రెస్ (20-25), ఆప్ (0-3)

ఇక, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 12వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ దాదాపుగా 75.6 శాతం ఓటింగ్ నమోదైంది. హిమాచ్ ప్రదేశ్‌లో మొత్తం 68 అసెంబ్లీ స్థానాల్లో 412 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే హిమాచల్ ప్రదేశ్‌లో గత 30 ఏళ్లుగా ఒకసారి బీజేపీ, మరోసారి కాంగ్రెస్.. ఇలా ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు ఎన్నికవుతూ వస్తున్నాయి. అయితే ఈసారి ఆ ట్రెండ్‌ను తిప్పికొట్టి.. వరుసగా రెండో సారి హిమాచల్‌లో విజయం సాధించాలని బీజేపీ పట్టుదలతో ప్రచారం చేసింది. మరోవైపు కాంగ్రెస్ ‌కూడా తన మనుగడ కోసం తీవ్రంగానే శ్రమించింది. ఈసారి  కొత్తగా ఆమ్ ఆద్మీ  పార్టీ కూడా ఎన్నికల బరిలో నిలిచింది. 

బలహీన వర్గాలకు చెందిన కాలేజికి వెళ్లే బాలికలకు స్కూటీలు, పాఠశాల బాలికలకు సైకిళ్లను అందజేస్తామని బీజేపీ పార్టీ వరాల జల్లు కురిపించింది. అలాగే రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని.. ఎనిమిది లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాలుగు ఎన్నికల సమావేశాలలో ప్రసంగించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా 11 ర్యాలీలలో, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా 20 సభలను ఉద్దేశించి ప్రసంగించారు. పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యనేతలు కూడా ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొన్నారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రచారం కోసం ఎక్కువగా రాష్ట్రంలోని ముఖ్యనేతలపైనే ఆధారపడాల్సి వచ్చింది. హిమాచల్‌కు ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న రాజీవ్ శుక్లా పార్టీ ప్రచారాన్ని పర్యవేక్షించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ ప్రచారంలో ఎక్కువగా కనిపించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ రాష్ట్రంలో కొన్ని సభలలో మాత్రమే పాల్గొన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ చీఫ్ ప్రతిభా సింగ్, ప్రచార కమిటీ అధ్యక్షులు సుఖ్వీందర్ సింగ్ సుఖు, ప్రతిపక్ష నేత ముఖేష్ అగ్నిహోత్రి.. పార్టీ అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ హామీల విషయానికి  వస్తే.. ‘హర్ ఘర్ లక్ష్మి’ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ. 1,500 అందజేస్తామని చెప్పడంతో సహా అనేక వాగ్దానాలను చేసింది. 300 యూనిట్ల ఉచిత విద్యుత్, వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు, రూ. 680 కోట్ల స్టార్టప్ ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నట్టుగా తెలిపింది. చివరగా 2012లో హిమాచల్‌లో విజయం సాధించిన సమయంలో కాంగ్రెస్.. 36 సీట్లు గెలుచుకుంది. ఆ సమయంలో బీజేపీ 26 స్థానాల్లో గెలుపొందింది. 

అయితే ఈసారి ఎన్నికల్లో రెండు పార్టీలకు రెబల్స్ బెడద పొంచి ఉంది. రెబల్స్‌గా నిలిచిన వారిలో చాలా మంది ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే సామర్థ్యం ఉన్నవారు కావడం, రెబల్స్‌ పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో భారీగా పోలింగ్‌ నమోదు కావడం.. ఇరు పార్టీల ఆందోళనను మరింతగా పెంచింది. అలాగే ఈసారి హిమాచల్‌ ప్రదేశ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎలాంటి ప్రభావం చూపుతుందో కూడా తెలియాల్సి ఉంది. అయితే నవంబర్ 12నే ఇక్కడ పోలింగ్ ముగిసినప్పటికీ.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఓట్ల లెక్కింపును ఆ రాష్ట్రంతో పాటే డిసెంబర్ 8న చేపట్టనున్నట్టుగా ఈసీ తెలిపింది. 

ఇక, 2017 అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 68 స్థానాలకు గానూ.. బీజేపీ 44 సీట్లు, కాంగ్రెస్ 21 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీకి 48.8 శాతం ఓట్లురాగా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి 41.7 శాతం ఓట్లు వచ్చాయి.

Follow Us:
Download App:
  • android
  • ios