Asianet News TeluguAsianet News Telugu

కార్గిల్ హీరో: హైదరాబాదీ మేజర్ సాహసం ఇదీ...

కార్గిల్ యుద్దంలో హైద్రాబాద్ కు చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య వీర మరణం పొందారు. 

major padmapani acharya:kargil hero from hyderabad
Author
Hyderabad, First Published Jul 26, 2019, 6:31 PM IST


కార్గిల్ యుద్ధంలో ఎందరో సైనికులు వీరమరణం పొందారు. అందులో తెలుగు వారు కూడా అనేక మంది. పాకిస్తానీ ముష్కరుల చెర నుండి కార్గిల్ ప్రాంతాన్ని తిరిగి దక్కించుకోవడానికి భారత సైనికులు తీవ్రమైన చలి గాలులను కూడా లెక్కచేయకుండా పోరాడారు. నేటితో  కార్గిల్ యుద్ధంలో మనం విజయం సాధించి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి.ఈ సందర్బంగా ఇదే యుద్ధంలో అసువులు బాసిన మన హైదరాబాద్ కే  చెందిన మేజర్ పద్మపాణి ఆచార్య గురించి తెలుసుకుందాం. 

 మేజర్ పద్మపాణి ఆచార్య   21 జూన్ 1969లో పుట్టాడు.అతను  వాస్తవానికి ఒడిశాలో పుట్టినప్పటికీ హైద్రాబాద్లో స్థిరపడ్డారు. అతని తండ్రి జగన్నాథ్ ఆచార్య కూడా భారత రక్షణ  దళాల్లో పనిచేసిన వారే. జగన్నాథ్ ఆచార్య భారత వాయు సేనలో వింగ్ కమాండర్ గా తన సేవలు అందించి రిటైర్ అయ్యారు. 

1998లో కార్గిల్ యుద్ధంలో టోలోలింగ్ పర్వతాన్ని ఆధీనంలోకి తెచ్చుకునేందుకు భారత సైన్యానికి చెందిన రాజపుతాన రైఫిల్స్ రెజిమెంటుకి నాయకత్వం వహిస్తూ  మేజర్ పద్మపాణి ఆచార్య వీరమరణం పొందారు. 

లెహ్ శ్రీనగర్ హైవేపైన భారత సైనికులను తరలించాలన్నా, వారికి అవసరమైన సామాగ్రిని అందించాలన్నా ఈ హైవే అత్యంత కీలకం. టోలోలింగ్ పర్వతంపైన భారీ బంకర్ లను ఏర్పాటు చేసుకొని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఈ హైవేపై బాంబుల వర్షం కురిపిస్తున్నారు. 

భారత్ యుద్ధం గెలవాలంటే ఈ పర్వతాన్ని ఆధీనంలోకి తెచుకోక తప్పదు. కానీ పర్వతంపైన ఉన్న వారిని కిందినుంచి ఎదిరించడం అంత సులువైన పని కాదు. ఒకరకంగా వారి గుళ్ల వర్షానికి ఎదురు వెళ్లడమే. 

అయినప్పటికీ మొక్కువోని దీక్షతో అకుంఠిత దేశభక్తితో మేజర్ పద్మపాణి ఆచార్య తన కంపెనీ ని ముందుండి నడిపించాడు. రెజిమెంటులో అప్పటికే చాలా మంది సైనికులు మరణించినప్పటికీ తాను మాత్రం కించిత్తు భయం కూడా లేకుండా ముందుకు సాగడంతోపాటు తన ప్లాటూన్ లో కూడా నూతనోత్సవాహాన్ని సమరోత్సాహాన్ని నింపి కదనరంగంలో ముందుకు నడిపాడు. 

తానే స్వయంగా ఒక బంకర్ వద్దకు చేరుకొని శత్రువులపైకి పలుమార్లు గ్రెనైడ్లు విసిరాడు. ఈ క్రమంలో ముష్కరుల కాల్పుల్లో తన వొంట్లో సైతం చాలా తూటాలు దిగాయి. అయినప్పటికీ తాను మాత్రం ఆగలేదు. తన పోరును కొనసాగిస్తూ శత్రువులపైకి దూకాడు.

 ఒక పూర్తి రాత్రి పాటు కొనసాగిన ఈ కాల్పుల్లో చివరకు రాజపుతాన  రైఫిల్స్ టోలోలింగ్ పర్వతాన్ని తిరిగి  తమ ఆధీనంలోకి తెచ్చుకున్నా మేజర్ పద్మపాణి ఆచార్యను మాత్రం ప్రాణాలతో వెనక్కి తెచ్చుకోలేకపోయింది. 

గాయపడ్డ తనని వెనక్కి తరలిస్తాము అని తన ట్రూప్ కోరినా కూడా వద్దు అంటూ పోరాడిన ధీరుడు మన పద్మపాణి ఆచార్య. 30వ పదిలోకి అడుగు పెట్టిన వారం రోజులకే తను వీరమరణం పొందాడు. మరణానంతరం భారత ప్రభుత్వం మహావీర్ చక్ర తో ఇతన్ని సత్కరించింది. 

ఈ సంఘటన జరిగే 10 రోజుల ముందు తన తండ్రికి రాసిన ఉత్తరం ఎన్ని సార్లు చదివినా , చదివిన ప్రతిసారీ కళ్ళు చెమ్మగిల్లుతూనే ఉంటాయి. ఈ లేఖను కనుక చదివితే ఇతను ఎంతటి స్థితప్రజ్ఞుడో అర్థమవుతుంది. 

ఈ లేఖలో తన తండ్రిని ఉద్దేశిస్తూ, మీరు మరణిస్తున్న సైనికుల గురించి ఆలోచించకండి. ఇది ఉద్యోగ నిర్వహణలో మన కంట్రోల్ లో లేని విషయం. అమ్మకు కూడా చెప్పండి, యుద్ధం లో దేశ రక్షణ కోసం పోరాడడమనేది ఒక సైనికుడికి అతి పెద్ద స్వప్నం. 

ఇంతకంటే ఎం చేయగలను నేను దేశానికి? అంతే చారు (అతని భార్య చారులత)కి మహాభారత కథలు రోజుకోటి చెప్పండి. అప్పుడు మీకు పుట్టబోయే మనవడు/మనువరాలు మంచి విలువలను పెంపొందించుకుంటారు. 

 ఇతను మరణించే నాటికి తన భార్య ఆరు నెలల గర్భవతి. ఇతని మరణానంతరం అతని భార్య చారులత ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ అమ్మాయికి అపరాజిత గా నామకరణం చేశారు. తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తూ అపరాజిత ఎన్ సి సి క్యాడెట్ గా శిక్షణ పూర్తి చేసుకుంది. అంతటి గొప్ప సైనికుడి కూతురు ఇలా కాకుండా ఎలా ఉంటుంది???

నోట్:  ఈ టోలోలింగ్ పర్వతం కోసం సాగిన యుద్ధాన్ని ముఖ్య ఇతివృత్తంగా తీస్కొని తీసిన ఎల్ ఓ సి కార్గిల్ సినిమా లో నాగార్జున మహాజోరు పద్మపాణి ఆచార్య పాత్రను పోషించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios