రాజౌరి: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో ఉగ్రవాదుల దాడి ఘటన మరువక ముందే మరోసారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. ఫిబ్రవరి 14న 44 మందిని బలితీసుకున్న ఉగ్రవాదులు మరోసారి ఐఈడీతో దాడికి ప్రయత్నించారు. భారత నియంత్రణ రేఖ వెంబడి జరిగిన ఓ పేలుడులో ఆర్మీ మేజర్ ప్రాణాలు కోల్పోయారు. 

శనివారం నౌషరా సెక్టార్‌ సమీపంలోని ఎల్‌ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్‌ ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్‌కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. 

నౌషరా సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వెలుపల 1.5కిలోమీటర్ల దూరంలో ఈ ఐఈడీని అమర్చినట్లు గుర్తించారు. జమ్ముకశ్మీర్‌లో భద్రత గురించి కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించిన గంటల వ్యవధిలోనే ఈ పేలుడు సంభవించడం గమనార్హం. 

ఇకపోతే ఈనెల 14న సెలవుల నుంచి విధుల్లో చేరేందుకు వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ వాహన శ్రేణిపై జైషే ఏ మహ్మద్‌ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో దాదాపు 44 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 

ప్రపంచం మెుత్తం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తోన్న సమయంలో మరోసారి దాడికి పాల్పడటం చర్చనీయాంశంగా మారింది. ఉగ్రవాదుల దాడికి భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఇప్పటికే భారత ప్రధాని నరేంద్రమోదీ పాకిస్థాన్ ను హెచ్చరించారు.