తీవ్రవాదులతో పోరులో ప్రాణాలు కోల్పోయిన జవాన్ కేతన్ శర్మ చనిపోయే కొన్ని క్షణాల ముందు ఆయన పంపిన చివరి మెసేజ్‌ను తల్చుకుని అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలిపిస్తున్నారు.

చనిపోవడానికి కొన్ని క్షణాల ముందు తన ఫోటోను కుటుంబసభ్యులకు వాట్సాప్ చేశారు. అంతేకాకుండా బహుశా ఇదే నా చివరి ఫోటో కావొచ్చు అనే సందేశాన్ని కూడా పంపారు. ఆయన మెసేజ్ పంపిన కొన్ని గంటల వ్యవధిలోనే ఉగ్రవాదుల తూటాలకు బలయ్యారు.

ఈ సంఘటన గురించి కేతన్ శర్మ బావమరిది మాట్లాడుతూ... ‘‘కేతన్ నుంచి మాకు మేసేజ్ రాగానే చాలా కంగారు పడ్డాం.. తనకు కాల్ చేశామని.. అయితే దానికి అతని నుంచి స్పందన లేదన్నారు.

దీంతో మరుసటి రోజు ఉదయం వెళ్లి ఆర్మీ అధికారులను కలవగా.. సోమవారం అనంత్‌నాగ్ ప్రాంతంలో ఉగ్రవాదులతో జరిగిన పోరులో కేతన్ శర్మ తీవ్రంగా గాయపడి మరణించినట్లు తెలిపారు.

దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు కేతన్ మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో అతని స్వస్థలం మీరట్‌‌కు తరలించారు. వేలాదిమంది ప్రజలు కేతన్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివచ్చారు.

తన అంకుల్‌ను స్ఫూర్తిగా తీసుకుని కేతన్ సైన్యంలో చేరాలని కలలు కన్నారు. కంబైన్డ్ డిఫెన్స్‌ సర్వీసెస్ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించి ఆర్మీలో చేరారు. కేతన్‌కు భార్య ఏరా, ఓ కూతురు ఉన్నారు.