కేరళలోని మలప్పురం జిల్లాలో పడవ బోల్తా పడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద సమయంలో బోటులో 30 మంది వరకు వున్నట్లుగా తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా అంటోంది.

కేరళలో విషాదం చోటు చేసుకుంది. మలప్పురం జిల్లాలో పడవ బోల్తా పడటంతో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పురపుజా నదిలో ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. తూవల్ తీరం టూరిస్ట్ స్పాట్ వద్ద పడవ బోల్తా పడింది. ప్రమాద సమయంలో బోటులో 30 మంది వరకు వున్నట్లుగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్, స్థానిక మత్స్యకారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గల్లంతైన వారిలో మహిళలు, పిల్లలు ఎక్కువగా వున్నారని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం వుందని అధికారులు అంటున్నారు. జాతీయ మీడియాలో వస్తున్న కథనాలను బట్టి సహాయక బృందాలు ఇప్పటి వరకు 10 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించాయి. 

అయితే పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానిక మీడియా అంటోంది. దీనికి తోడు పడవలో ప్రమాదాన్ని నివారించే పరికరాలు లేవు. గమ్యానికి 300 మీటర్ల దూరంలో వుండగా.. పడవ ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ బోటులోని ప్రయాణీకుల్లో అత్యధికులు మలప్పురం జిల్లాలోని పరప్పనంగడి, తానూర్ ప్రాంతాలకు చెందినవారే. ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ఈ తరహా పడవలు నడిపేందుకు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అనుమతి వుంది.