తమిళనాడులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ధర్మపురి జిల్లాలో శనివారం భారీ కంటైనర్‌ను, సిమెంట్‌ ట్రైలర్‌ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 10 మందికి పైగా తీవ్రగాయాల పాలయ్యారు.

ధర్మపురి - సేలం రహదారిపై తోప్పుర్ ఘాట్ రోడ్ వద్ద సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, కంటైనర్‌ను ఢీకొట్టింది. దీంతో వెనక వేగంగా వస్తున్న 15 వాహనాలు అదుపుతప్పి ఒకదానినొకటి  ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో పది మంది తీవ్రగాయాల పాలయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఈ ప్రమాదంతో బెంగళూరు హైవేపై భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.