అమెరికా వెళ్లిన స్నేహితుడి మెయిల్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేశారు. ముంబాయిలో ఉండే సీనియర్ సిటిజన్ కు మెయిల్ చేశారు. అందులో  తన కూతురు డెలివరీ అయ్యిందని, మెడికల్ అవసరాల కోసం వెంటనే లక్ష రూపాయిలు పంపాలని అందులో కోరారు. స్నేహితుడికి డబ్బులు పంపి, కాల్ చేసిన తరువాత తాను మోసపోయానని సీనియర్ సిటిజన్ గ్రహించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రోజు రోజుకు సైబ‌ర్ నేరాలు (Cyber Crimes) పెరిగిపోతున్నాయి. పోలీసులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, బ్యాంకులు ఈ సైబ‌ర్ నేరాల ప‌ట్ల అవ‌గాహ‌న క‌లిస్తున్న‌ప్ప‌టికీ అమాయ‌కులు మోస‌పోతూనే ఉన్నారు. బ్యాంకు అకౌంట్ల నుంచి డ‌బ్బులు పొగొట్టుకుంటునే ఉన్నారు. ఏటీఎం కార్డు (ATM Card) బ్లాక్ అయ్యింద‌ని, కార్డ్ నెంబ‌ర్, సీవీవీ నెంబ‌ర్ (Cvv Number) చెప్పాల‌ని, తాము బ్యాంకు ఆఫీస‌ర్ల‌మ‌ని కాల్ చేస్తారు. వివ‌రాలు అన్నీ చెప్ప‌గానే అకౌంట్ హోల్డ‌ర్ ప్ర‌మేయం లేకుండా డ‌బ్బులు డ్రా అవడం ఒక ర‌కం మోసం అయితే.. బ్యాంకులో కేవైసీ (KYC) అప్ డేట్ (Update) చేస్తున్నామ‌ని చెప్పి ఆధార్, ఇత‌ర ముఖ్య‌మైన వివ‌రాలు అన్నీ అడిగి మోసం చేయ‌డం ఇంకో ర‌కం మోసం. 

టెక్నాల‌జీ పెరిగినా కొద్దీ ఈ సైబ‌ర్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఇటీవ‌ల కాలంలో ఫేస్ బుక్ (Facebook) అకౌంట్ ను హ్యాక్ చేసి.. అకౌంట్ లో ఉన్న ఫ్రెండ్స్ కు మెసెంజ‌ర్ లో మెసేజ్ లు పెడుతున్నారు. త‌మ‌కు ఎమ‌ర్జెన్సీగా డ‌బ్బు అవ‌సరం ఉంద‌నీ, రెండు మూడు రోజుల్లో డ‌బ్బులు తిరిగి పంపిస్తామ‌ని చెబుతున్నారు. త‌న గూగుల్ పే, ఫోన్ పే ప్ర‌స్తుతం ప‌ని చేయ‌డం లేద‌ని త‌న ప‌క్క‌న ఉన్న వ్య‌క్తికి లేదా త‌న స్నేహితుడికి డ‌బ్బులు పంపాల‌ని సూచిస్తున్నారు. ఇలాంటి విష‌యాలు న‌మ్మి చాలా మంది వారికి డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసి, కొంత స‌మయం త‌రువాత తాము మోస‌పోయామ‌ని గ్ర‌హిస్తున్నారు. ఇలాంటి కేసులు సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు త‌ర‌చూ వ‌స్తున్నాయి. కాగా ముంబాయి ప‌ట్ట‌ణానికి చెందిన ఓ సీనియ‌ర్ సిటిజ‌న్ కూడా ఇదే త‌ర‌హా మోసానికి గుర‌య్యారు. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం... ముంబాయి (mumbai)లోని అంధేరి (andheri)లోని వెర్సోవా (versova)లో 76 ఏళ్ల వ్య‌క్తి నివసిస్తున్నారు, అయితే అదే ఆపార్ట్ మెంట్ లో నివ‌సించే స్నేహితుడు త‌న కుమార్తెను చూడ‌టానికి యూఎస్ (US) వెళ్లారు. అయితే యూఎస్ వెళ్లి వ్య‌క్తి ఈమెయిల్ ను సైబ‌ర్ నేర‌స్తులు హ్యాక్ చేశారు. ముంబైలో ఉంటున్న సీనియ‌ర్ సిటిజన్ (senior citizen)కు ఓ మెయిల్ పంపారు. త‌న కుమార్తె మ‌గబిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని ఆ మెయిల్ లో పేర్కొన్నారు. అయితే హాస్పిట‌ల్ ఖ‌ర్చుల కార‌ణంగా అర్జెంట్ గా ల‌క్ష రూపాయిలు కావాల‌ని, వాటిని వెంట‌నే ట్రాన్స్ ఫ‌ర్ చేయాల‌ని అందులో కోరారు. ఆ డ‌బ్బులను త‌న బంధువుల ఖాతాలో వేయాల‌ని సూచించారు. ఇది నిజ‌మే అని న‌మ్మిన సీనియ‌ర్ సిటిజ‌న్ అతని స్నేహితుడికి డ‌బ్బులు ట్రాన్స్ ఫ‌ర్ చేశారు. అనంత‌రం ఆయ‌నకు ఫోన్ చేశారు. డ‌బ్బులు ట్రాన్స్ ఫ‌ర్ చేశాన‌ని తెలిపారు. అయితే త‌ను అలా డ‌బ్బులు అడ‌గ‌లేద‌ని చెప్పారు. అనంత‌రం మెయిల్ చెక్ చేస్తే అకౌంట్ హ్యాకింగ్ కు గుర‌య్యింద‌ని తెలిసింది. దీంతో మోసపోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. అయితే హ్యాక‌ర్ లు ఇలాంటి మెయిల్ లో అనేక మందికి పంపిన‌ట్టు త‌రువాత గుర్తించారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు.