తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. 

తృణమూల్ కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ శీతకాల సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్‌సభలో 2022-23కి సంబంధించి అదనపు గ్రాంట్ల డిమాండ్‌పై చర్చ సందర్భంగా మహువా మోయిత్రా మాట్లాడుతూ.. దేశాన్ని ప్రభావితం చేసే అనేక సమస్యలపై కేంద్రంపై విరుచుకుపడ్డారు. కేంద్రం తప్పుడు వాదనలు చేస్తుందని.. బీజేపీ ప్రభుత్వం తీవ్ర అమసర్థతతో కూడుకున్నదని ఆరోపించారు. 

“ఈ దేశ ఆర్థిక వ్యవస్థ గొప్ప అభివృద్దితో వెళుతుందని ఈ ప్రభుత్వం ప్రతి ఫిబ్రవరిలో నమ్ముతుంది. మనం వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత సమర్థవంతమైన గ్లోబల్ ప్లేయర్. అందరికీ ఉపాధి లభిస్తోంది. గ్యాస్ సిలిండర్లు, కరెంటు, పక్కా గృహాలు పొందుతున్నాం. ఈ అబద్ధం సుమారు 8 నుంచి 10 నెలల పాటు రాజ్యమేలుతుంది. దాని తర్వాత నిజం కుంటుతూ వస్తుంది. ఇప్పుడు మనం డిసెంబర్‌లో ఉన్నాం. బడ్జెట్ అంచనాలకు మించి రూ. 3.26 లక్షల కోట్ల అదనపు నిధులు అవసరమని ప్రభుత్వం చెబుతోంది.

ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం, అధికార పార్టీ తీవ్ర అసమర్థతను సూచించడానికి, కించపరచడానికి పప్పు అనే పదాన్ని ఉపయోగించాయి. ప్రస్తుత గణాంకాలు పప్పు నిజంగా ఎవరు అని చూపిస్తున్నాయి’’ అని మహువా మొయిత్రా అన్నారు. ఈ సందర్భంగా ఆమె ఆర్థిక వ్యవస్థపై డేటాను చదివి వినిపించారు

“ఎన్‌ఎస్‌వో సంఖ్యలు నిన్న బయటపడ్డాయి. అక్టోబర్‌లో పారిశ్రామికోత్పత్తి 4 శాతం తగ్గి 26 నెలల కనిష్టానికి చేరుకుంది. తయారీ రంగం 5.6 శాతం క్షీణించింది. తయారీ రంగంలోనే అత్యధిక ఉద్యోగుల కల్పన జరుగుతుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీని రూపొందించే పరిశ్రమల రంగాల్లో 17 ప్రతికూల వృద్ధి రేటును నమోదు చేశాయి. ఫారెక్స్ నిల్వలు ఏడాది కాలంలో 72 బిలియన్ డాలర్లు పడిపోయాయి’’అని ఆమె అన్నారు. 

ఇటీవలే ముగిసిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమిపై కూ మహువా మొయిత్రా విమర్శలు గుప్పించారు. అధికార పార్టీ అధ్యక్షుడు తన సొంత రాష్ట్రంలో విజయాన్ని సొంతం చేసుకోలేకపోయారని అన్నారు. ‘‘ఇప్పుడు పప్పు ఎవరు?’’ అని ప్రశ్నించారు.