కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. కాగా.. ఈ మహమ్మారికి మన జాతిపిత మహాత్మాగాంధీ ముని మనవడు కూడా బలయ్యాడు. మహాత్మాగాంధీ ముని మనవడు సతీష్ ధుపేలియా దక్షిణ ఆస్ట్రేలియాలో మరణించారు. న్యూమోనియా, కొవిడ్-19తో బాధపడుతున్న సతీష్ నెల రోజుల నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆయన  ఆదివారం మరణించినట్టు ఆయన సోదరి ఉమా ధుపేలియా మెస్త్రి తెలిపారు.

 న్యూమోనియాతో చికిత్స పొందుతున్న సమయంలో తన సోదరుడికి కొవిడ్-19 సోకినట్టు ఆమె చెప్పారు. నెల రోజుల నుంచి చికిత్స పొందుతూ వచ్చిన సతీష్ ఆదివారం సాయంత్రం కార్డియాక్ అరెస్ట్‌తో ప్రాణాలు విడిచినట్టు పేర్కొన్నారు. కాగా.. సతీష్‌ తన జీవితంలో ఎక్కువ కాలం మీడియా రంగంలో వీడియో గ్రాఫర్, ఫొటో గ్రాఫర్‌గా పనిచేశారు. అంతేకాకుండా గాంధీ డెవలప్‌మెంట్ ట్రస్ట్‌‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ వచ్చారు. సతీష్‌కు ఉమాతో పాటు కీర్తి మీనన్ అనే మరో సోదరి కూడా ఉన్నారు. వీరు ముగ్గురు మహాత్మాగాంధీ రెండో కుమారుడు మనీలాల్ గాంధీ వారసులు కావడం గమనార్హం.