భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతోపాటు మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ కలిసి నడవనున్నారు. ఈ రోజు మహారాష్ట్రలో బుల్దానా జిల్లా షెగావ్‌లో రాహుల్ గాంధీ యాత్రలో తుషార్ గాంధీ పాల్గొన్నారు. తుషార్ గాంధీ యాత్రలో చేరడం చారిత్రాత్మకం అని కాంగ్రెస పేర్కొంది. జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మునిమనవళ్లు చేస్తున్న ఈ యాత్ర పాలకులకు స్పష్టమైన సందేశం ఇస్తుందని తెలిపింది. 

ముంబయి: కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో మహాత్మా గాంధీ మునిమనవడు తుషార్ గాంధీ ఈ రోజు చేరారు. మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో షెగావ్ దగ్గర ఆయన రాహుల్ గాంధీతో కలిసి యాత్ర చేశారు. భారత్ జోడో యాత్రలో తుషార్ గాంధీ పాల్గొనడాన్ని చారిత్రాత్మకం అని కాంగ్రెస్ పేర్కొంది.

నవంబర్ 7వ తేదీ నుంచి భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో సాగుతున్నది. అకోలా జిల్లా బాలాపూర్‌లో ఉదయం 6 గంటలకు ప్రారంభమైన ఈ యాత్ర కొన్ని గంటల వ్యవధిలోనే షెగావ్‌కు చేరుకుంది. షెగావ్ దగ్గర రచయిత, కార్యకర్త తుషార్ గాంధీ ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ యాత్ర గురించి తుషార్ గాంధీ గురువారం ఓ ట్వీట్ చేశారు. ఇది ఆయన జన్మస్థలం అని తుషార్ గాంధీ పేర్కొన్నారు.

నవంబర్ 15వ తేదీన తుషార్ గాంధీ ఈ విషయమై ట్వీట్ చేశారు. 18వ తేదీన షెగావ్‌లో భారత్ జోడో యాత్రలో పాల్గొనబోతున్నట్టు వివరించారు. షెగావ్ నా బర్త్ స్టేషన్ అని తెలిపారు. నాగపూర్ గుండా హౌరా మెయిల్‌కు పోతున్న షెగావ్ స్టేషన్ దగ్గరకు రాగానే తన తల్లి ప్రసవించిందని వివరించారు. 1960 జనవరి 17వ తేదీన తాను ట్రైన్‌లో షెగావ్ స్టేషన్ దగ్గర జన్మించినట్టు తెలిపారు.

Also Read: 'ప్రతిపక్షం క్లీన్ అవుతోంది': కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరడంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

కాగా, కాంగ్రెస్ పార్టీ ఆయన పార్టిసిపేషన్‌ను హిస్టారిక్ అని వర్ణించింది. రాహుల్ గాంధీ, తుషార్ గాంధీలు జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ మునిమనవళ్లు అని తెలిపింది. ఆ ఇద్దరు నేతల వారసత్వాన్ని వీరు కొనసాగిస్తున్నారని పేర్కొంది. వీరిద్దరు కలిసి యాత్ర చేయడం పాలకులకు ఒక సందేశం ఇస్తున్నదని వివరించింది. వారు ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో నెట్టొచ్చేమో గానీ, దాన్ని మొత్తంగానే అంతం చేయలేరని వీరిద్దరి యాత్ర స్పష్టం చేస్తున్నదని తెలిపింది.

Scroll to load tweet…

తుషార్ గాంధీతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేతలు ముకుల్ వాస్నిక్,దీపేందర్ హుడా, మిలింద్ డియోరా, మానిక్ రావ్ ఠాక్రే, ముంబయి కాంగ్రెస్ అధ్యక్షుడు భాయ్ జగతాప్, కాంగ్రెస్ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే ఈ యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.

ఈ రోజు సాయంత్రం షెగావ్‌లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. మహారాష్ట్రలో భారత్ జోడో యాత్ర తుది అంకానికి చేరింది. నవంబర్ 20వ తేదీన మధ్యప్రదేశ్‌కు వెళ్లనున్నది. పొరుగు రాష్ట్ర గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.