Asianet News TeluguAsianet News Telugu

నా కుమార్తె  చావుకు వారే కారణం.. రూ.1000 కోట్ల న‌ష్ట‌ పరిహారం ఇవ్వాల‌ని డిమాండ్..  బిల్ గేట్స్ కు నోటీసులు

ఒక వ్యక్తి తన కుమార్తె మరణానికి కోవిషీల్డ్ యాంటీ-కరోనా వ్యాక్సిన్ కారణమని సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నుండి రూ. 1000 కోట్ల పరిహారం కోరాడు. 

maharastra Man demands Rs 1,000 crore from Covid-19 vaccine makers for daughter death
Author
First Published Sep 3, 2022, 1:57 PM IST

మహారాష్ట్రకు చెందిన ఒక వ్యక్తి తన కుమార్తె మరణానికి కోవిషీల్డ్ యాంటీ-కరోనా వ్యాక్సిన్ కారణమని సెరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) నుండి రూ. 1000 కోట్ల పరిహారం ఇప్పించాలంటూ ముంబై కోర్టును ఆశ్రయించాడు. మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం, కేంద్ర ప్ర‌భుత్వం, వ్యాక్సిన్ సంస్థ‌ సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, డీసీజీఐ నుంచి పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరాడు.

ఆయ‌న దాఖాలు చేసిన పిటిష‌న్ ను ముంబై హైకోర్టు విచారణకు స్వీక‌రించింది. జస్టిస్ ఎస్వీ గంగాపూర్వాలా, జస్టిస్ మాధవ్ జామ్‌దార్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఆగస్టు 26న పిటిషన్‌ను విచారించింది. పిటిషనర్‌ ఆరోపణలపై స్పందన తెలియజేయాలంటూ.. టీకా తయారీ సంస్థతో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. కేసు తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది ముంబై హైకోర్టు.

మహారాష్ట్రకు చెందిన దిలీప్‌ లునావత్‌ కుమార్తె స్నేహాల్‌ లునావత్‌ ఓ వైద్య విద్యార్థిని. నాసిక్‌లో చదువుతున్న ఆమె జనవరి 28, 2021న కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంది. వ్యాక్సిన్ తీసుకున్న కొద్ది రోజులకే స్నేహల్‌కు తీవ్రమైన తలనొప్పి వచ్చి వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా మెదడులో రక్తస్రావం అయిందని వైద్యులు తెలిపారు. ఆమె చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించడంతో మార్చి 1,  2021 న ప్రాణాలు కోల్పోయింది.

ఈ ఘ‌ట‌న‌పై దర్యాప్తు జరిపిన కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని క‌మిటీ యాంటీ-కరోనా వ్యాక్సిన్ (AEFI) దుష్ప్రభావాలపై నివేదిక‌ను వెల్ల‌డించింది. ఆ కమిటీ నివేదిక‌ను కూడా ఆ పిటిష‌నర్ త‌న పిటిష‌న్ లో పొందుప‌రిచాడు. ఆ పిటిష‌న్ పై  విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎస్‌వీ గంగాపూర్‌వాలా, జస్టిస్‌ మాధవ్‌ జందార్‌లతో కూడిన ధర్మాసనం.. వ్యాక్సిన్‌ సంస్థతో పాటు కేంద్రప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి, డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్ ఇండియాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిష‌న్ త‌దుప‌రి విచార‌ణ‌ను నవంబర్‌ 17కు వాయిదా వేసింది
 
6168 కొత్త కరోనా కేసులు, 21 మరణాలు

ఇదిలా ఉంటే.. దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం..గత 24 గంటల్లో 6,168 కేసులు నమోదు కాగా, 21 మరణాలు సంభవించాయి.  దీంతో క్రియాశీల కేసుల సంఖ్య‌ 59,210 చేరింది. రోగుల రికవరీ రేటు 98.68 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. రోజువారీ ఇన్ఫెక్షన్ రేటు 1.94 శాతం ఉండ‌గా.. వారానికి సంక్రమణ రేటు 2.51 శాతంగా న‌మోదైంది. కోవిన్ పోర్టల్ డేటా ప్రకారం.. ఇప్పటివరకు మొత్తం 212.93 కోట్ల యాంటీ-కరోనా వ్యాక్సిన్ డోసుల‌ను పంపిణీ చేశారు. వీటిలో మొదటి డోసును 102.47 కోట్ల మంది, రెండవ డోసును 94.29 కోట్ల మంది, బూస్ట‌ర్ డోసును 16.17 కోట్ల మందికి అంద‌జేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios