Asianet News TeluguAsianet News Telugu

ఇక మృతదేహాలకు కరోనా పరీక్షలు బంద్

కరోనా అనుమానిత మృతదేహాలన్నింటికి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

maharastra govt stop testing bodies to corona test
Author
Hyderabad, First Published Jun 20, 2020, 9:01 AM IST

కరోనా వైరస్ దేశంలో విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకీ ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి. ఎవరెవరికి కరోనా సోకిందో నిర్థారించేందుకు ముందస్తు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు. మొన్నటి వరకు చనిపోయిన వారికి కూడా పరీక్షలు నిర్వహించారు. అయితే.. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించబోమని స్పష్టం చేసింది.

అనుమానిత మృతదేహాలకు పరీక్షలు నిర్వహించటానికి సుధీర్ఘ సమయం తీసుకుంటున్న నేపథ్యంలో అంత్యక్రియలు జరపటానికి ఇబ్బందులు పడాల్సి వస్తోందంటూ మృతుల కుటుంబ సభ్యులు చేస్తున్న ఫిర్యాదులపై మహారాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. కరోనా అనుమానిత మృతదేహాలన్నింటికి పరీక్షలు నిర్వహించే ప్రక్రియను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. మృతుల కాంటాక్ట్స్‌ ఆధారంగా కరోనా ఫలితాలను కనుక్కుంటామని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రదీప్‌ వ్యాస్‌ పేర్కొన్నారు. కంటైన్‌మెంట్‌ జోన్‌లో ఉంటూ మరణించి, కరోనా లక్షణాలు ఉన్న వారి మృతదేహాలకు మాత్రమే పరీక్షలు చేస్తామని తెలిపారు. 

కాగా, ల్యాబ్‌ రిపోర్టులు వచ్చేంత వరకు ఆగకుండా కరోనా వైరస్‌ అనుమానితుల మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు వెంటనే అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం కొద్దిరోజుల క్రితం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. మృతదేహాలకు కరోనా పరీక్షలు నిర్వహించటం వల్ల తప్పుడు ఫలితాలు వచ్చే ఆస్కారం ఉందని కేంద్రం పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios