కరోనాతో తల్లిదండ్రులు మరణించి అనాథలైన చిన్నారులకు విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మహారాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వీరి చదువుల ఫీజులను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ భరించనుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 401 మంది కొవిడ్ అనాథలున్నారు.

ముంబయి: కరోనా మహమ్మారి లక్షలాది కుటుంబాల్లో విషాదం నింపింది. కొవిడ్ చికిత్సకు ఇల్లు గుల్ల చేసుకుని అప్పులఊబిలో మునిగినవారెందరో ఉన్నారు. ఆప్తులను కోల్పోయి నిరాశలో కుంగినవారున్నారు. పోషకులు మరణించి కుటుంబమే రోడ్డుపాలైన ఘటనలూ ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలపై ఈ మహమ్మారి కోలుకోలేని దెబ్బ తీసింది. తల్లి లేదా తండ్రి మరణించి కష్టాల కడగళ్లలో మునిగిన పిల్లలుండగా ఇరువురినీ కోల్పోయి భవితే అంధకారంగా మారిన చిన్నారులూ ఉన్నారు. తల్లి తండ్రీ మరణించి అనాథలైన వారి సంక్షేమం కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. 

కొవిడ్ అనాథలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రకటించింది. ఇదే దారిలో మహారాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగేసింది. వీరికి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇవ్వనున్నట్టు వెల్లడించింది. విద్య, ప్రభుత్వోద్యోగాల్లో ఒక శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి సీఎం ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఈ నిర్ణయం చరిత్రాత్మకమైనదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి యశోమతి ఠాకూర్ కితాబిచ్చారు.

కొవిడ్‌తో మరణించిన తల్లిదండ్రుల పిల్లలకు ప్రాథమిక, సెకండరీ, ఉన్నత విద్యకు ఫీజులను రాష్ట్ర మహిళా శిశసంక్షేమ శాఖ భరిస్తుందని మంత్రి యశోమతి ఠాకూర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, మహారాష్ట్రలో కొవిడ్ కారణంగా తల్లిదండ్రులు మరణించి అనాథలైన పిల్లల సంఖ్య 401గా ఉన్నది.

వీరిని రాష్ట్ర ప్రభుత్వం పలుకేటగిరీలుగా విభజించి ప్రయోజనాలు అందించడానిరి ప్రణాళికలు వేసింది. ఉదాహరణకు బంధువులు, సోదరీసోదరులు, నివాసమూ తెలియని పిల్లలను ‘ఏ’ కేటగిరీగా విభజించింది. తమ సామాజిక తరగతి తెలియని లేదా ఆ వర్గాన్ని ధ్రువీకరించే దస్తావేజులు లేని అనాథలను ‘బీ’ కేటగిరీలో చేర్చనున్నారు. ఈ ధ్రువీకరణ అంతాకూడా ప్రభుత్వమే చూసుకోనుంది. ‘సీ’ కేటగిరీలో తండ్రివైపు బంధువులున్న అనాథ పిల్లలను చేర్చింది.

ఇందులో ఏ, బీ కేటగిరీల్లోని పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఉండనుంది. సీ కేటగిరీ పిల్లలకు విద్యలో రిజర్వేషన్ ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండదని రాష్ట్ర మంత్రి వివరించారు. ఈ వివరాలను వెల్లడించే ప్రత్యేక సర్టిఫికేట్లను తాము జారీ చేస్తామని, తద్వారా భవిష్యత్‌లో ఎలాంటి ఆటంకాలు రాకుండా నివారిస్తామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వూ కొవిడ్ అనాథల కోసం ప్రత్యేకంగా ఒక పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పీఎం కేర్స్ పథకం కింద ఈ చిన్నారులకు ఆయుష్మాన్ భారత్ కింద హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించి ప్రీమియంలు కేంద్రమే చెల్లించనుంది. తల్లీ తండ్రి మరణించిన అనాథలకు నెలవారీగా స్టైపెండ్ ఇవ్వనుంది. 23ఏళ్లు నిండిన తర్వాత రూ. 10 లక్షల నిధిని అందజేయనుంది.