ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రాత్రికి రాత్రి ఆశ్చర్యకరమైన, అనూహ్యమైన మలుపు తిరిగాయి. బిజెపికి చెందిన దేవేంద్ర ఫడ్నవీస్ శుక్రవారం రాత్రి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్సీపీకి చెందిన అజిత్ పవార్ డీప్యూటీ సిఎంగా ప్రమాణం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ వారి చేత ప్రమాణం చేయించారు. 

అజిత్ పవార్ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు. కాంగ్రెసు, ఎన్సీపి, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైన స్థితిలో రాత్రికి రాత్రే అన్యూహ్యంగా ఆ కూటమికి ఎదురు దెబ్బ తగిలింది. మహారాష్ట్ర సిఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ ను, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన అజిత్ పవార్ ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారు. మహారాష్ట్ర అభివృద్ధి వారు కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

సుస్థిరమైన పాలన అందిస్తామని రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్ చెప్పారు. స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు. 

ప్రజలు తమకు స్పష్టమైన ఆదేశాలిచ్చారని ఆయన అన్నారు. మహారాష్ట్రకు సుస్థిరమైన ప్రభుత్వం అవసరమని, కిచిడీ ప్రభుత్వం కాదని ఆయన అన్నారు. శివసేన ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకుందని ఆయన చెప్పారు. 

మహారాష్ట్రలో రైతు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయిందని, దాంతో సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నట్లు అజిత్ పవార్ చెప్పారు.