మహారాష్ట్ర పంచాయితి సుప్రీంకోర్టు ముందుకు చేరింది. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని రెబల్ ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అనర్హత నోటీసు సవాల్ చేస్తూ తమ పిటిషన్లు అత్యవసర విచారణగా స్వీకరించాలని కోరారు. సుప్రీంకోర్టు రేపు ఈ పిటిషన్లను విచారించనుంది. 

న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయం ఈ రోజు లీగల్ జోన్‌లోకి వెళ్లింది. తిరుగుబాటుదారుల శిబిరం ఈ రోజు సుప్రీంకోర్టును ఆశ్రయించి పటిషన్లు వేశారు. ఏక్‌నాథ్ షిండేతోపాటు మరో 15 మంది ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్ జారీ చేసిన అనర్హత నోటీసులను వారు సవాల్ చేశారు. శివసేన లెజిస్లేచర్ పార్టీ లీడర్‌గా అజయ్ చౌదరిని నియమించడాన్నీ వారు చాలెంజ్ చేశారు. డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు వ్యతిరేకంగా తాము చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించడాన్నీ సవాల్ చేశారు.

డిప్యూటీ స్పీకర్ తొలగింపుపై నిర్ణయం ఖరారు అయ్యే వరకు తమకు పంపిన అనర్హత నోటీసులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా సుప్రీంకోర్టు డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌ను ఆదేశించాలని రెబల్ ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లలో పేర్కొన్నారు. 2019లో తనను శివసేన లెజిస్లేచర్ పార్టీ నేతగా 55 మంది శివసేన నేతలు తీర్మానం చేశారని వివరించారు. కానీ, తనను శివసేన లెజిస్లేచరర్ పార్టీ నేతగా ఉద్ధవ్ ఠాక్రే క్యాంప్ తొలగించేటప్పుడు మాత్రం 35 మంది ఎమ్మెల్యేలు కూడా లేరని ఆ పిటిషన్‌లో ఏక్‌నాథ్ షిండే పేర్కొన్నారు. 

ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణగా చేపట్టాలని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏక్‌నాథ్ షిండే క్యాంపు దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు రేపు విచారణ చేపట్టనుంది.

ఈ వారం మొదట్లో ఏక్‌నాథ్ షిండే సహా 16 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని శివసేన డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు అనర్హత అప్పీల్ చేసింది. అయితే, అసెంబ్లీలో హాజరు కావాలని పార్టీ విప్ జారీ చేసినప్పుడు ఆ విప్‌ను ఉల్లంఘిస్తే అనర్హత వేటు వేస్తారని, పార్టీ మీటింగ్‌కు విప్ ఉల్లంఘించినా అనర్హత వేయడం సాధ్యపడదని ఏక్‌నాథ్ షిండే వర్గం వాదిస్తున్నది.