Heavy rainfall: సెప్టెంబరు 13, 14న ముంబ‌యిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో నగరంలో నీటి ఎద్దడి ఏర్పడింది. భారత వాతావరణ శాఖ ప్రకారం ఈ నెల 16 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 

Mumbai rainfall: దేశ‌వ్యాప్తంగా ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌హారాష్ట్రలోనూ ప‌లు చోట్ల వాన‌లు దంచికొడుతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో ముంబ‌యి, థానేల‌తో పాటు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు భారత వాతావరణ విభాగం (IMD) బుధవారం 'ఎల్లో' అలర్ట్ ప్రకటించింది. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం బుధ, గురువారాల్లో ముంబ‌యిలో పాటు దాని ప‌రిసర ప్రాంతాలైన పూణే, థానే, పాల్ఘర్, రాయ్‌గడ్‌లలో మోస్తారు నుంచి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశ‌ముంద‌ని అంచనా వేసింది. భారీ వర్షాల దృష్ట్యా రాయగఢ్, రత్నగిరి, సతారాలో వాతావరణ శాఖ 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది.

ముంబ‌యిలో సెప్టెంబర్ 13 నుంచి 15 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, సెప్టెంబర్ 14-16 తేదీలలో భారీ వర్షాలు, సెప్టెంబర్ 17 న మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భార‌త వాతావ‌ర‌ణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. బుధవారం ఉదయం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ముంబ‌యిలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మ‌హారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా మొత్తం 28 జిల్లాలు దెబ్బతిన్నాయి. వాటిలో పూణే, సతారా, షోలాపూర్, నాసిక్, జల్గావ్, అహ్మద్‌నగర్, బీడ్, లాతూర్, వాషిం, యవత్మాల్, ధులే, జల్నా, అకోలా, భండారా, బుల్దానా, నాగ్‌పూర్, నందుర్బార్, ముంబై సబ్, పాల్ఘర్, థానే, నాందేడ్, అమరావతి, వార్ధా, రత్నగిరి, సింధుదుర్గ్, గడ్చిరోలి, సాంగ్లీ, చంద్రపూర్ లు ఉన్నాయి. 

మహారాష్ట్ర స్టేట్ డిజాస్టర్ సిట్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం జూన్ 1 నుండి రాష్ట్రంలో వరద సంబంధిత సంఘటనలలో సుమారు 120 మంది మరణించినట్లు వార్తా సంస్థ ఏఎన్ఐ నివేదించింది. ఇదిలావుండ‌గా, ముంబ‌యి నగరానికి తాగునీటిని సరఫరా చేసే సరస్సులలో మొత్తం నిల్వలు 100% మార్కుకు చేరుకోవడంతో రాబోయే సంవత్సరంలో ఎటువంటి నీటి కోతలు ఉండే అవకాశం లేద‌ని సంబంధిత అధికార వ‌ర్గాలు పేర్కొన్నాయి. ఏడు సరస్సులకు పూర్తి స్థాయికి చేరుకోవడానికి 14.47 లక్షల మిలియన్ లీటర్ల నీరు అవసరమని BMC రికార్డులు చెబుతున్నాయి. సోమవారం నాటికి మొత్తం నీటి నిల్వలు 14.24 లక్షల మిలియన్ లీటర్లుగా ఉన్నాయి. సోమవారం ఉదయం, ఏడు సరస్సులలో మూడింటిలో 100% స్టాక్ ఉంది. అవి మోదక్ సాగర్, విహార్, తులసి. పరిశ్రమలకు సరఫరా చేసే నీటి నిల్వ అయిన తూర్పు శివారులోని పోవై సరస్సు జూలై 5న పొంగిపొర్లింది. ఆ తర్వాత మోదక్ సాగర్, తాన్సా, తులసి, విహార్ అనే నాలుగు సరస్సులు కూడా పొంగిపొర్లాయి. దీంతో తాగునీటి సమస్యలు వచ్చే ఏడాదివరకు ఉండకపోవచ్చునని పురపాలక సంఘం అధికారులు పేర్కొంటున్నారు. 

మరోవైపు ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా, డెహ్రాడూన్, నైనిటాల్, చమోలి, ఉత్తరకాశీ జిల్లాలకు గురువారం నుండి శనివారం వరకు ఐఎండీ 'ఆరెంజ్' అలర్ట్ జారీ చేసింది. 'ఆరెంజ్' హెచ్చరిక 'అతి భారీ వర్షపాతం'ను సూచిస్తుంది.