Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Politics: బ‌ల నిరూప‌ణ‌కు సీఎం షిండే సిద్దం! గోవా నుంచి ముంబై చేరుకున్న రెబ‌ల్ సేన‌

Maharashtra Politics: మ‌హారాష్ట్ర సీఎం ఏకనాథ్ షిండే సేన రెబల్స్‌తో కలిసి గోవా నుంచి ముంబై చేరుకున్నారు. జూలై 3, 4 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ క్ర‌మంలో షిండే త‌న బ‌ల నిరూప‌ణ చేసుకోనున్నారు.

Maharashtra Politics Eknath Shinde Arrives In Mumbai From Goa With Rebels
Author
Hyderabad, First Published Jul 2, 2022, 11:25 PM IST

Maharashtra Politics: మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఎన్నో ఊహించిన ప‌రిణామాల మ‌ధ్య శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యే ఏక్ నాథ్ షిండే మ‌హా ముఖ్య‌మంత్రిగా, బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అయితే.. శివ‌సేన రెబ‌ల్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండే.. త‌న బ‌లాన్ని నిరూపించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. ఈ క్ర‌మంలో క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్ల మ‌ధ్య రెబ‌ల్ కూటమిని గోవా నుంచి ముంబాయిలో అడుగు పెట్టింది. 

శనివారం సాయంత్రం.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తన వర్గం ఎమ్మెల్యేలతో కలిసి గోవా నుండి ముంబై చేరుకున్నారు. ఇందులో ఏక్‌నాథ్ షిండేతో పాటు శివసేనకు చెందిన 39 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు, మ‌ద్దతుదారులు ఉన్నారు. క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా మ‌ధ్య‌ గోవాలోని తాజ్ కన్వెన్షన్ సెంటర్ హోటల్ నుండి గోవా విమానాశ్రయానికి బయలుదేరారు. అక్క‌డి నుంచి ప్ర‌త్యేక విమానంలో ఆ బృందం ముంబైకి  చేరుకుంది. ఈ క్ర‌మంలో ఎమ్మెల్యేల కోసం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో 3 ప్ర‌త్యేక‌ లగ్జరీ బస్సులను  ఏర్పాటు చేశారు.  అసోం నుండి  తిరిగి వచ్చిన శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు గ‌త రెండు రోజులుగా.. గోవాలోనే ఉన్న విష‌యం తెలిసిందే. 

అంత‌కు ముందు గోవాలో.. ఆ రాష్ట్ర  పోలీసులు, కమాండో యూనిట్ మధ్య రెబ‌ల్స్ వాహనాల కాన్వాయ్ బయటకు వచ్చింది. ఈ కాన్వాయ్‌లో మొత్తం 3 బస్సులు ఉండగా.. బస్సుల ముందు గోవా పోలీసు అధికారులు వాహ‌నాలు ర‌క్ష‌ణ‌గా నిలిచాయి. గతంలో గోవాలోని హోటల్‌ను హైసెక్యూరిటీ జోన్‌గా మార్చారు. ఈ హోటల్‌కు వెళ్లే వారి ప్రవేశ ద్వారం వద్ద క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. శివసేన ఎమ్మెల్యేలు గౌహతి నుండి బయలుదేరే ముందు ప్రసిద్ధ కామాఖ్య దేవి ఆలయాన్ని సందర్శించారు. ఈ ఎమ్మెల్యేలు వారం రోజులకు పైగా ఇక్కడ క్యాంప్‌ చేశారు.

12 రోజుల తర్వాత ముంబాయి చేరిన రెబ‌ల్స్
 
శివసేనకు చెందిన 39 మంది ఎమ్మెల్యేలతో సహా 50 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు 12 రోజుల తర్వాత తమ నివాసాల‌కు తిరిగి రానున్నారు. దీనికి ముందు.. జూన్ 21 న శివసేన రెబ‌ల్ నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు 20 మంది శివసేన ఎమ్మెల్యేలు స్వంత‌ పార్టీపై తిరుగుబాటు చేశారు. ఈ రెబ‌ల్ సేన తొలుత సూరత్ వెళ్లారు. ప‌లు చ‌ర్చ‌ల అనంత‌రం రెబ‌ల్ క్యాంప్ గౌహతికి షిప్ట్ అయ్యింది. అప్ప‌టి నుండి.. అస్సాం కేంద్రంగా రెబల్ నాయ‌కుడు ప‌లువురు నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఈ క్ర‌మంలోనే వారి కొంత‌మంది ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇచ్చారు.ఈ సంఖ్య క్ర‌మంగా..  50కి చేరింది. 

మ‌రోవైపు.. రెబ‌ల్ ఎమ్మెల్యేలను తిరిగి రావాలని  శివసేన నాయకులు ఒత్తిడి చేస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో శివసేన రాజ్యసభ ఎంపీ సంజ‌య్ రాత్ త‌న పరిమితిని దాటారు. రెబ‌ల్ ఎమ్మెల్యేల మృతదేహాలు మాత్ర‌మే.. రాష్ట్రంలోకి తిరిగి వస్తాయని వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తర్వాత దాన్ని సరిదిద్దుకుని తన ప్రకటనను వెన‌క్కి తీసుకున్నారు. అదే సమయంలో.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రే కూడా  రెబ‌ల్ ఎమ్మెల్యేల గురించి ప‌లు సంచ‌ల‌న‌ ప్రకటనలు చేశారు. ఇది ఏ సందర్భంలోనూ సరికాద‌నీ, న‌మ్మ‌క‌ద్రోహ చ‌ర్య‌గా అభివ‌ర్ణించారు.

ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జూలై 3, 4 తేదీల్లో జరగనున్నాయి. ఆదివారం జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేక స‌మావేశాల్లో కోలాబా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్‌ను స్పీకర్‌గా ఎన్నుకోవాడానికి బీజేపీ సిద్ధమవుతోంది. ఈ క్ర‌మంలో  షిండే నేతృత్వంలోని తిరుగుబాటు శివసేన గ్రూపుకు అధికారిక గుర్తింపు లభించింది. ఈ క్ర‌మంలో మహారాష్ట్ర నూత‌న‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్‌నాథ్ షిండే..  గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదేశాల మేర‌కు సోమవారం జ‌రుగ‌నున్న  అసెంబ్లీ ప్ర‌త్యేక‌ స‌మావేశాల్లో తన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. 

నిజమైన శివసేన కోసం న్యాయ పోరాటం
 
ఏక్‌నాథ్ షిండే విషయంలో మీ నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటే న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ఉద్ధవ్ ఠాక్రేను ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన శివసేన అధికార ప్రతినిధి దీపక్ కేసర్కర్ హెచ్చరించారు. జూలై 1న మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాకరే ఏకనాథ్ షిండేను శివసేన నాయకుడి పదవి నుంచి తొలగించారు. ఈ చ‌ర్య‌ను కేసర్కర్ తీవ్రంగా వ్య‌తిరేకించారు. ఇలాంటి బెదిరింపుల‌కు పాల్ప‌డితే.. న్యాయ‌పోరాటం చేస్తామ‌నీ, నిజమైన శివసేన కోర్టుకు వెళితే.. ఉద్ధవ్ ఠాక్రే పార్టీని కోల్పోవాల్సిన అవసరం ఉంటుంద‌నీ, ఎందుకంటే శివసేన యొక్క మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు షిండే వర్గంతో ఉన్నారని తెలిపారు. 

అంతకుముందు.. దీపక్ కేసర్కర్ మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి పదవుల‌పై చర్చ జరగలేదని, త‌మ‌లో ఎవరూ కూడా మంత్రి పదవిని అడగలేదని చెప్పారు. పార్టీ నిబంధనల ప్రకారం.. పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటే.. దానిని అందరూ అంగీకరిస్తారనీ, కానీ ఇప్పుడు షిండేసాహెబ్ ప్రజాస్వామ్య పద్ధతిలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెట్టడానికే కొందరి పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయని కేసర్కర్ అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios