Maharashtra political: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆశ్చర్యపోయారు. డిప్యూటీ సీఎం పదవిపై ఫడ్నవీస్ సంతోషంగా లేరని, ఆ విషయంలో ఆయన ముఖంలోనే ఇది కనిపిస్తున్నదని అన్నారు.
Maharashtra political: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయడంపై నేషలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ స్పందించారు. డిప్యూటీ సీఎం పదవిపై దేవేంద్ర ఫడ్నవిస్ సంతోషంగా లేరని, అతని ముఖంలో ఆ విషయం కనిపిస్తుందని అన్నారు. ఏక్‌నాథ్ షిండే సీఎం ప్రమాణస్వీకారం చేసిన తరువాత.. శరద్ పవార్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీలో.. ఢిల్లీ లేదా నాగ్‌పూర్ నుండి ఆర్డర్ వచ్చిన తర్వాత - అది ఎటువంటి రాజీ లేకుండా అనుసరిస్తుందేనని అన్నారు. షిండేతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలంతా.. షిండేకు డిప్యూటీ సీఎం పదవి వస్తుందన్న ఆశతో ఉన్నారని, కానీ, బీజేపీ ఊహించని విధంగా.. ఏకంగా సీఎం పదవిని ఆఫర్ చేస్తుందని.. షిండే కూడా ఈ విషయాన్ని ఊహించి ఉండరని శరద్ పవార్ అన్నారు.
మహారాష్ట్ర సీఎంగా షిండేను ప్రకటించిన తరువాత.. తాను కొత్త ప్రభుత్వంలో చేరబోనని, బయటి నుంచి మద్దతు ఇస్తానని ఫడ్నవీస్ ప్రకటించిన విషయాన్ని శరద్ పవార్ గుర్తు చేశారు. కానీ అధిష్టానం ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎంగా పదవి చేపట్టారని అన్నారు. ప్రధానంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒత్తిడితో ఫడ్నవీస్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని చెప్పారు.
రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఫడ్నవీస్.. మళ్లీ సీఎం కావాలని ఆశించి భంగపడి చివరకు అసంతృప్తితో డిప్యూటీ సీఎం పదవీతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం పదవి చేపట్టడం ఎంత మాత్రం ఇష్టం లేదని, అందుకే.. మొదట నూతన ప్రభుత్వంలో తాను భాగస్వామ్యం కాలేనని ప్రకటించారని, కానీ.. బీజేపీ అధిష్ఠానం ఒత్తిడికి తలొగ్గిన ఫడ్నవీస్ చివరి క్షణంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని ఎద్దేవా చేశారు.
ఉద్ధవ్ ఠాక్రే, శివసేన భవిష్యత్తు గురించి పవార్ మాట్లాడుతూ.. శివసేన గతంలోనూ అనేక తిరుగుబాటులను ఎదుర్కొని, తిరిగి పోరాడిందని అన్నారు. శివసేన అంతమైందని తాను అనుకోవడం లేదనీ, గతంలో ఛగన్ భుజ్‌బల్ తిరుగుబాటు చేశారు. కానీ, అతను, అతని మద్దతుదారులు తరువాత ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత తిరుగుబాటు చేసిన నారాయణ్ రాణే కూడా ఓటమిని చవిచూశాడని తెలిపారు. శివసేనలో అనేక తిరుగుబాట్లు జరిగాయని.. ప్రజలు వారికి సరైన బుద్ది చెప్పారని ఆయన అన్నారు.
తిరుగుబాటు మధ్య థాకరే పక్షాన నిలిచిన ఎన్‌సిపి చీఫ్.. నూతనంగా సీఎం బాధ్యతలు చేపట్టిన షిండేకు అభినందనలు తెలిపారు. అతని పాలనలో మహారాష్ట్ర ప్రయోజనాలు కాపాడబడతాయని తాను ఆశిస్తున్నానని అన్నారు. “మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు శ్రీ ఏక్నాథ్ షిండేకి అభినందనలు! ఆయన మహారాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తారని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను' అని పవార్ ట్వీట్ చేశారు.
