మహారాష్ట్రలో శివసేన  పార్టీలో ఏర్పడిన సంక్షోభంపై ఈరోజు సుప్రీం కోర్టులో కీలక విచారణ  జరిగింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంపై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు ధర్మాసనం గురువారం తన ఉత్తర్వును ప్రకటించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించమని ఆదేశించలేమని స్పష్టం చేసింది. ఉద్ధవ్ ఠాక్రే ఫ్లోర్ టెస్ట్‌ను ఎదుర్కోలేక తన రాజీనామాను సమర్పించినందున.. యథాతథ స్థితిని పునరుద్ధరించలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. అతిపెద్ద పార్టీ బీజేపీ మద్దతుతో ఏక్‌నాథ్ షిండేతో గవర్నర్ ప్రమాణం చేయించడం సమర్థనీయమని తెలిపింది. మహారాష్ట్ర మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీని ఈ సందర్భంగా కోర్టు ప్రస్తావించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 

ఇక, గత ఏడాది జూన్‌ 30న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని మహారాష్ట్ర గవర్నర్‌ పిలుపునివ్వడం సబబు కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అంతర్‌ పార్టీ లేదా అంతర్గత వివాదాల సమస్యలను పరిష్కరించడానికి ఫ్లోర్ టెస్ట్‌ను మాధ్యమంగా ఉపయోగించలేమని ధర్మాసనం పేర్కొంది. ‘‘గవర్నర్ రాజకీయ రంగంలోకి ప్రవేశించడానికి, అంతర్గత పార్టీ నుంచి అంతర్గత వివాదానికి పాత్ర పోషించడానికి అర్హులు కాదు. కొంతమంది సభ్యులు శివసేనను విడిచిపెట్టాలనుకుంటున్నారు అనే ప్రాతిపదికన ఆయన వ్యవహరించలేరు’’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. గవర్నర్ లేఖపై ఆధారపడకూడదని.. ఉద్ధవ్ ఠాక్రే మద్దతు కోల్పోయారని లేఖ సూచించలేదని పేర్కొంది. అసంతృప్త ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని కోరుతున్నట్లు గవర్నర్ చేసిన ఏ కమ్యూనికేషన్‌లోనూ సూచించలేదని తెలిపింది. 

అయితే అదే సమయంలో మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ వ్యవహరించిన తీరును సుప్రీం కోర్టు తప్పుబట్టింది. శివసేన పార్టీ విప్‌గా గోగావాలే (షిండే గ్రూపు)ని నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు పేర్కొంది. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఏక్నాథ్ షిండే క్యాంపు ఎమ్మెల్యే గోగావాలేను శివసేన విప్‌గా గుర్తించలేదని తెలిపింది. రాజకీయ పార్టీ నియమించిన విప్‌కు మాత్రమే గుర్తింపు ఇవ్వాలని పేర్కొంది. 

స్పీకర్ ముందు విచారణ పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం (ఈసీ) చిహ్నాల ఆర్డర్ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని వర్గానికి శివసేన అధికారిక చిహ్నాన్ని ఈసీ గతంలో ఇచ్చిన సంగతి తెలిసిందే. 

ఇక, సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ మాట్లాడుతూ.. స్పీకర్ తొలగింపుకు నోటీసు ఇస్తే.. అది అనర్హత నోటీసులు జారీ చేయడానికి స్పీకర్ అధికారాలను పరిమితం చేస్తుందా? లేదా? అనే అంశాలను విస్తృత ధర్మాసనం పరిశీలించాలని అన్నారు. ఎమ్మెల్యేలపై అనర్హత వేటుపై స్పీకర్ అధికారానికి సంబంధించి ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం 2016 నబమ్ రెబియా తీర్పును ఏడుగురు న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనానికి రిఫర్ చేసింది. ఇక, మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్ల‌పై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం మార్చి 17న తన తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.