Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టు ప్ర‌త్యేక బెంచ్ కు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభ పిటిషన్లు

సుప్రీంకోర్టు: అసలైన శివసేనగా గుర్తించాలనీ, ఎన్నికల గుర్తును కేటాయించాలని కోరుతూ ఏక్‌నాథ్ షిండే వర్గం వేసిన పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోవడం మానుకోవాలని సుప్రీంకోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. 
 

Maharashtra Political Crisis Petitions Transferred to Special Bench of Supreme Court
Author
Hyderabad, First Published Aug 23, 2022, 2:57 PM IST

మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు: మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు ఇంకా హాట్ హాట్ గానే కొన‌సాగుతున్నాయి. ముఖ్యంగా శివ‌సేన చీలిక ఆ పార్టీ రెండు వ‌ర్గాల మ‌ధ్య రాజ‌కీయ వేడిని పుట్టిస్తోంది. రెండు వ‌ర్గాలు ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావిస్తూ.. సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. అయితే, మ‌హారాష్ట్ర రాజ‌కీయ సంక్షోభానికి సంబంధించిన పిటిష‌న్ల‌ను ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ప్ర‌త్యేక ధ‌ర్మాస‌నానికి సుప్రీంకోర్టు బ‌దిలీ చేసింది. ఇప్ప‌టినుంచి ఆయా పిటిష‌న్ల‌ను ఐదుగురు న్యాయ‌మూర్తుల ధ‌ర్మాస‌నం విచార‌ణ జ‌ర‌ప‌నుంది. 

వివ‌రాల్లోకెళ్తే.. శివ‌సేన పార్టీ రెండుగా చీలిపోయిన సంగ‌తి తెలిసిందే. అయితే, శివసేనలోని  రెండు  వర్గాల మధ్య మహారాష్ట్రలో రాజకీయ వివాదం ముదిరింది. పార్టీ విష‌యంలో రెండు గ్రూపులు దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించాయి. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ఒక వ‌ర్గం, మరొకటి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని మ‌రో వ‌ర్గం శివ‌సేన త‌మ‌దంటే త‌మ‌దే అని పేర్కొంటూ పిటిష‌న్లు దాఖ‌లు చేశాయి. ఆయ పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు ప్ర‌త్యేక రాజ్యాంగ ధ‌ర్మాస‌నానికి బ‌దిలీ చేసింది. ఇప్ప‌టినుంచి ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ప్ర‌త్యేక బెంచ్ విచారిస్తుంద‌ని తెలిపింది. శివ‌సేన రెండు వ‌ర్గాలు దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌ను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం ఆగస్టు 25, గురువారం నాడు విచారిస్తుందని సుప్రీంకోర్టు మంగళవారం తెలిపింది. కాగా, ఆయా పిటిష‌న్లు  పార్టీ ఫిరాయింపులు, విలీనం, ఎమ్మెల్యేల అనర్హతలకు సంబంధించినవిగా ఉన్నాయి. 

నిజమైన శివసేనగా గుర్తించి, దానికి ఎన్నికల గుర్తును కేటాయించాలని కోరుతూ ముఖ్య‌మంత్రి ఎక్ నా3థ్ షిండే వర్గం వేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఉండాలని కూడా కోర్టు ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ పిటిషన్లను గురువారం రాజ్యాంగ ధర్మాసనం ముందు జాబితా చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని జస్టిస్ కృష్ణ మురారి, హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.  "రేపు మరుసటి రోజు రాజ్యాంగ ధర్మాసనం ముందు ఈ అంశాన్ని జాబితా చేయండి. ప్రారంభంలో ఎన్నికల కమిషన్‌కు సంబంధించిన చిహ్నాన్ని బెంచ్ నిర్ణయిస్తుందని" బెంచ్ తెలిపింది. కాగా, మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం రాష్ట్రంలో మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం పతనానికి దారితీసింది. ఇంత‌కుముందు ఎన్నిక‌ల జ‌రిగిన త‌ర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్, శివ‌సేన‌, ఎన్సీపీలు క‌లిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 

అయితే, శివసేన లోని కొంత‌మంది తిరుగుబాటు ఎగుర‌వేయ‌డంతో రాష్ట్రప్ర‌భుత్వం మైనార్టీలోకి జారుకుంది. దీంతో ఉద్ధ‌వ్ థాక‌రే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. శివ‌సేన రెబ‌ల్ నాయ‌కుడు ఏక్ నాథ్ షిండే.. బీజేపీతో చేయి క‌లిపి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ముఖ్య‌మంత్రిగా ఆయ‌న బాధ్య‌త‌లు చేప‌ట్టగా, బీజేపీ నాయ‌కుడు దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ఉప‌ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు రెబ‌ల్ నాయ‌కులు త‌మ‌దే నిజ‌మైన శివ‌సేన‌గా గుర్తించాలనీ, పార్టీ ఎన్నిక‌ల గుర్తును త‌మ‌కే కేటాయించాల‌ని సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఇదిలావుండ‌గా, బీజేపీ-ఏక్ నాథ్ షిండే వర్గాల మ‌ధ్య అప్పుడే దూరం పెరుగుతున్న‌ద‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే అయినప్పటికీ, ముందు అడుగులో ఉన్న‌ది బీజేపీ వారే న‌ని సూచ‌న‌లు, ప‌రిణామాలు క‌నిపిస్తున్నాయి. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్‌కులే ప్రకటించిన ఒక రోజు తర్వాత, బుల్దానా నుండి 2024 లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్థిని నిలబెడుతున్నట్లు బీజేపీ ప్రకటించింది. ప్రస్తుతం, షిండే శిబిరంలో ఉన్న 12 మంది శివసేన ఎంపీలలో ఒకరైన ప్రతాప్ జాదవ్ ఈ సీటును కలిగి ఉన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios