Asianet News TeluguAsianet News Telugu

‘‘మహా’’ రాజకీయంలో ట్విస్ట్.. తిరిగొచ్చిన శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్.. కిడ్నాప్ చేశారని కామెంట్..

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంలో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండ్‌కు మద్దతుగా నిలిచినట్టుగా భావించిన ఆ పార్టీ ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ తిరిగి మహారాష్ట్రకు చేరుకన్నారు.

Maharashtra Political crisis I was kidnapped says Sena MLA Nitin Deshmukh after returns
Author
First Published Jun 22, 2022, 3:29 PM IST

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభంలో మరో సంచలన ట్విస్ట్ చోటుచేసుకుంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండ్‌కు మద్దతుగా నిలిచినట్టుగా భావించిన ఆ పార్టీ ఎమ్మెల్యే నితిన్ దేశ్‌ముఖ్ తిరిగి మహారాష్ట్రకు చేరుకన్నారు. తాను ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేకు మద్దతుగా ఉన్నానని చెప్పారు. తనను కిడ్నాప్ చేసి సూరత్‌కు తీసుకెళ్లారని.. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చినట్టుగా తెలిపారు. ‘‘నేను తప్పించుకుని తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రోడ్డుపై నిలబడి.. రోడ్డుపై వెళ్తున్న వాహనాల్లో అక్కడి నుంచి బయటపడాలని భావించాను. అయితే ఆ సమయంలో వంద మందికి పైగా పోలీసులు వచ్చి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. వారు నాకు గుండెపోటు వచ్చినట్లు నటించారు. నా శరీరంపై కొన్ని వైద్య ప్రక్రియలను నిర్వహించడానికి ప్రయత్నించారు. నాకు అప్పుడు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు ”అని నితిన్ దేశ్‌ముఖ్ మీడియాకు తెలిపారు. 

మీడియా అడిగిన ఓ ప్రశ్నపై స్పందించిన నితిన్ దేశ్‌ముఖ్.. ‘‘నేను కచ్చితంగా ఉద్ధవ్ ఠాక్రే‌తో ఉన్నాను’’ అని చెప్పారు. ఇదిలా ఉంటే.. నితిన్ దేశ్‌ముఖ్ మహారాష్ట్రలోని బాలాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే నితిన్ దేశ్‌ముఖ్.. శివసేన రెబల్ క్యాంపు‌లో చేరిపోయాడనే వార్తలు వచ్చాయి.

ఇదిలా ఉంటే.. నితిన్ దేశ్‌ముఖ్‌కు ప్రాణహాని ఉందనే అనుమానంతో ఆయన భార్య Pranjali మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. జూన్ 20 రాత్రి 7 గంటలకు తన భర్తతో ఫోన్ కాల్‌లో చివరిసారిగా మాట్లాడానని.. ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో అతనితో కమ్యూనికేట్ చేయలేకపోతున్నానని అకోలా పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వకంగా ప్రాంజలి ఫిర్యాదు చేశారు.తన భర్తకు ప్రాణహాని ఉందని అనుమానిస్తున్నట్లు ఆమె తెలిపారు.

హోం ఐసోలేషన్‌లో ఉద్దవ్ ఠాక్రే..
కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఉద్దవ్ ఠాక్రే హోమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లారు. రాష్ట్ర కేబినెట్ భేటీకి కొన్ని గంటల ముందు ఈ పరిణామం చోటుచేసంది. దీంతో ఉద్దవ్ ఠాక్రే.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. మరోవైపు ఇప్పటికే శివసేన నుంచి ఏక్‌నాథ్ షిండే‌తో జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఉద్దవ్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి.

40కు పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందంటున్న ఏక్‌నాథ్ షిండే
శివసేన తిరుగుబాటు మంత్రి ఏక్‌నాథ్ షిండే.. ఈరోజు ఉదయం సూరత్‌ నుంచి తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి అస్సాంలోని గౌహతికి వెళ్లారు. తనకు  40 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ప్రకటించారు.  అయితే ఏక్‌నాథ్ షిండే‌తో ఎంతమంతి ఎమ్మెల్యేలు ఉన్నారనే విషయంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. 

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన ట్వీట్.. ఈ వార్తలకు బలం చేకూరిచ్చినట్టయింది. మహారాష్ట్రలో శాసనసభ రద్దు దిశగా రాజకీయ పరిణామాలు ఉన్నాయంటూ సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 

ఇక, మహారాష్ట్రలో మహా వికాస్ అఘాడి కూటమి ప్రభుత్వంలో భాగమైన శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు, ఎన్సీపీకి 53 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ 44 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మొత్తం 288 స్థానాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత సాధారణ మెజారిటీ మార్క్ 145. 

Follow Us:
Download App:
  • android
  • ios