Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Political Crisis: త్వరలోనే మహారాష్ట్రకు శివసేన రెబల్స్.. ఢిల్లీలో భేటీ కానున్న షిండే, ఫడ్నవీస్..!

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఢిల్లీకి మారింది. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన రెబ‌ల్ ఎమ్మెల్యేల క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే‌లు ఢిల్లీలో భేటీ కానున్నట్టుగా తెలస్తోంది. 

maharashtra Political crisis eknath Shinde leaves delhi likely to meet devendra fadnavis
Author
First Published Jun 28, 2022, 2:42 PM IST

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మహారాష్ట్ర పొలిటికల్ డ్రామా ఇప్పుడు ఢిల్లీకి మారింది. మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీ చేరుకన్నారు. బీజేపీ అధిష్టానం పిలుపుతోనే ఆయన ఢిల్లీ చేరుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఈ భేటీలో మహారాష్ట్రలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను అమిత్ షాకు ఫడ్నవీస్ వివరించే అవకాశం ఉంది. అలాగే అమిత్ షా కూడా రాష్ట్రంలో బీజేపీ అనుసరించాల్సిన వైఖరిపై ఫడ్నవీస్‌కు కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. 

ఇదిలా ఉంటే శివసేన రెబ‌ల్ ఎమ్మెల్యేల క్యాంపుకు నాయకత్వం వహిస్తున్న ఏక్‌నాథ్ షిండే కూడా నేడు ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉంది. ఢిల్లీలో దేవేంద్ర ఫడ్నవీస్‌తో ఏక్‌నాథ్ షిండే భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్దిరోజులుగా బీజేపీ నేతలతో ఏక్‌నాథ్ షిండ్ టచ్‌లో ఉన్నాడని.. ఇటీవల కొందరు కీలక నేతలతో రహస్యంగా భేటీ అయినట్టుగా వార్తలు వచ్చాయి. 

ఈ నేపథ్యంలోనే శివసేన రెబల్స్‌తో కలిసి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరుపుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే క్యాంపులోని పలువురికి మంత్రి పదవులు ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు త్వరలోనే తాను, తనతోపాటు ఉన్న ఎమ్మెల్యేలు మహారాష్ట్ర చేరుకుంటామని ఏక్‌‌నాథ్ షిండే చెప్పారు. అయితే ఏక్‌నాథ్ షిండే వర్గం మహారాష్ట్రకు చేరుకున్న తర్వాత పరిణామాలు మరింత వేగంగా మారే అవకాశం ఉంది. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం సమసిపోవాలంటే విశ్వాస పరీక్ష అవసరమని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అందుకు బీజేపీ కానీ, షిండే వర్గం కానీ సుమఖంగా లేదని ఆ వర్గాలు చెబుతున్నారు. ఎందుకంటే మహా వికాస్ అఘాడి కూటమి వద్ద బలం లేదని చెబుతున్నప్పటికీ.. ఇప్పటివరకు షిండే వర్గం నుంచి కానీ, ప్రతిపక్ష బీజేపీ నుంచి కానీ అటువంటి డిమాండ్ అనేది రావడం లేదు. ఇక, ఏక్‌నాథ్‌ షిండే వర్గం తమ పార్టీలో విలీనం అయితే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుదని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. 

ఇక, ఏక్‌నాథ్ షిండ్ క్యాంపులోకి ఎమ్మెల్యేలకు సోమవారం సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డిప్యూటీ స్పీకర్ జారీచేసిన అనర్హత నోటీసులను సవాల్‌ చేస్తూ షిండే ఒక పిటిషన్‌ వేయగా.. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలన్న తీర్మానంపై నిర్ణయం తీసుకునేదాకా తమపై ఆయన ఎలాంటి చర్యలూ తీసుకోకుండా నియంత్రించాలని కోరుతూ మిగతా 15 మంది ఎమ్మెల్యేలూ మరో పిటిషన్‌ సుప్రీంకోర్టులో వేశారు. ఈ క్రమంలోనే విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం.. డిప్యూటీ స్పీకర్‌ వారికి పంపిన అనర్హత నోటీసులపై సమాధానం ఇవ్వడానికి జూలై 12 దాకా సమయమిచ్చింది. ఈ పిటిషన్లపై 5 రోజుల్లోగా కౌంటర్‌ అఫిడవిట్లు దాఖలు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి, డిప్యూటీ స్పీకర్‌కు ఆదేశాలు జారి చేసింది. తదుపరి విచారణను జూలై 11కు వాయిదా వేసింది. 

ఇదిలా ఉండగా.. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే రెబ‌ల్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. గౌహతిలో ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలందరికీ మా తలుపులు తెరిచి ఉన్నాయి. సోమవారం రాత్రి మీడియా ఆయ‌న ప్రతినిధులతో మాట్లాడుతూ.. గౌహతి ఉన్న రెబ‌ల్స్ రెండు వర్గాలుగా విడిపోయార‌ని ఆయన్నారు. త‌న‌తో15-16 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నార‌ని తెలిపారు. మనల్ని ఎదుర్కొనే ధైర్యం, నైతికత వారికి అస్సలు లేవని అన్నారు.ఈ క్ర‌మంలో షిండే వర్గానికి చెందిన రెబ‌ల్ ఎమ్మెల్యేలకు ఆయ‌న సవాల్ విసిరారు. రెబల్స్‌కు నిజంగా దమ్ముంటే.. రాజీనామా చేసి త‌మ‌ ముందు నిలబడాలని సూచించారు. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల వెనుక ఎవరున్నారో అంటూ బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను టార్గెట్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios