Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Political Crisis: 'ఎమ్మెల్యేలను బెంగాల్‌కు పంపండి, వారికి మంచి ఆతిథ్యం ఇస్తాం..': మమతా బెనర్జీ

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. రాష్ట్రంలోని MVA ప్రభుత్వాన్ని అనైతిక, రాజ్యాంగ విరుద్ధమైన పద్ధతిలో పడగొట్టడానికి కేంద్రం ప్రయత్నిస్తుంద‌ని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాషాయ పార్టీ ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అస్తవ్యస్తం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తుందని ఆరోపించారు. 
 

Maharashtra Political Crisis: BJP Attempt To Topple Maharashtra Government Unethical: Mamata Banerjee
Author
Hyderabad, First Published Jun 23, 2022, 11:37 PM IST

Maharashtra Political Crisis: మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడి (MVA ) ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి బిజెపి చేస్తున్న ప్రయత్నాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శించారు, దీనిని అనైతిక, రాజ్యాంగ విరుద్ధ చ‌ర్య‌గా అభివర్ణించారు. రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్దేశపూర్వకంగానే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నించిందని అన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఫెడరల్ నిర్మాణాన్ని పూర్తిగా కూల్చివేయడం దురదృష్టకరమ‌నీ,  మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అనైతికంగా, రాజ్యాంగ విరుద్ధంగా పడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 

'ఉద్ధవ్ ఠాక్రేకు న్యాయం జరగాలి'

మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ మమత బెన‌ర్జీ మీడియాతో మాట్లాడారు.  ప్రజాస్వామ్యం ఎటువైపు వెళుతోంది? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం నాశనం చేస్తే న్యాయం ఎలా ఉంటుంది? ప్రజలకు, ప్రజల ఆదేశానికి,  ఉద్ధవ్ ఠాక్రే (మహారాష్ట్ర ముఖ్యమంత్రి)కి న్యాయం జరగాలని తాను కోరుకుంటున్నాన‌ని తెలిపారు.

'ఎమ్మెల్యేలను బెంగాల్‌కు పంపండి, వారికి మంచి ఆతిథ్యం ఇస్తాం'

ఇదిలా ఉంటే.. MVAకి నాయకత్వం వహిస్తున్న తిరుగుబాటు శివసేన అస‌మ్మ‌తి ఎమ్మెల్యేల‌ను తొలుత సూరత్‌కు వెళ్లారు. అక్కడ ఒక రోజు బస చేసిన తర్వాత.. మ‌రుస‌టి రోజు చార్టర్డ్ విమానంలో గౌహతికి త‌ర‌లించారు. ఇది మహారాష్ట్రలోని ఎంవీఏ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంగా కనిపిస్తోంది.  ఈ విష‌యాన్ని దీదీ ప్ర‌స్తావిస్తూ.. రెబ‌ల్ ఎమ్మెల్యేలను అస్సాంకు బదులు బెంగాల్‌కు పంపాలని, అక్కడ వారికి మంచి ఆతిథ్యం ఇస్తారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ బీజేపీని కోరారు.

అసోం ప్రభుత్వం వరదలను ఎదుర్కొంటున్నప్పుడు ..వారిని ఎందుకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు? రెబ‌ల్ ఎమ్మెల్యేలను బెంగాల్‌కు పంపండి. వారికి మంచి ఆతిథ్యం ఇస్తామ‌నీ, ప్రజాస్వామ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటామని ఎద్దేవా చేశారు. మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రభుత్వాలను కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని దీదీ ఆరోపించారు. ఇప్ప‌టికే ప‌లువురు ప్రతిపక్ష పార్టీల నేతలకు ఈడీ సమన్లు ​​జారీ చేసింద‌ని విమ‌ర్శించారు. కనీసం 200 మంది తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలపై ఉద్దేశ్య‌పూర్వకంగా ఈడీ దాడులు చేసింద‌ని, తమ ముందు హాజరు కావాలని కేంద్ర ఏజెన్సీలు కోరినట్లు దీదీ పేర్కొన్నారు. 

నేడు బీజేపీ చేతిలో అధికారముంది. అందుకే వారు డబ్బు బలం, మాఫియాను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఇలా నాశనం చేయవద్దనీ, డబ్బు లేదా ED, CBIని ఉపయోగించి రాజకీయ పార్టీలను విచ్ఛిన్నం చేయవద్దని కేంద్రాన్ని కోరారు. మహారాష్ట్ర తర్వాత ఇతర ప్రభుత్వాలను కూడా పడగొట్టే ప్రయత్నం చేస్తామని ఆరోపించారు. త్రిపురలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు గురువారం జరిగిన ఉప ఎన్నికల్లో ఓటర్లను వేధించారని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ ఆరోపించారు. ప్రజలను ఓటు వేయడానికి  బిజెపి అనుమతించలేద‌ని ఆరోపించారు.

Follow Us:
Download App:
  • android
  • ios