Asianet News TeluguAsianet News Telugu

Maharashtra crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం.. అందరిచూపు బీజేపీ పైనే.. టాప్‌-10 పాయింట్స్

Maharashtra: శివ‌సేన నాయ‌కుడు, మ‌హారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. గవర్నర్ రాజీనామాను ఆమోదించ‌డం కూడా జ‌రిగింది. ఇప్పుడు రాష్ట్ర రాజ‌కీయ సంక్షోభం నేప‌థ్యంలో అనేక అంశాలు తెర‌మీద‌కు వస్తున్నాయి. 
 

Maharashtra political crisis .. All eyes on BJP;Here are the top-10 details
Author
Hyderabad, First Published Jun 30, 2022, 9:48 AM IST

Maharashtra political crisis: మ‌హారాష్ట్ర రాజ‌కీయాలు కాక‌రేపుతున్నాయి. శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేల తిరుగుబాటు కార‌ణంగా రాష్ట్రంలో రాజ‌కీయ సంక్షోభం ఏర్ప‌డింది. సీఎం ఉద్ధ‌వ్ థాక్రే సైతం రాజీనామా చేయాల్సిన ప‌రిస్థితికి దారితీసింది. గురువారం జరగాల్సిన ఫ్లోర్ టెస్ట్‌కు ముందే శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అనూహ్యంగా బ‌ల‌ప‌రీక్షకు ముందే ఉద్ధ‌వ్ థాక్రే తప్పుకోవడంతో మహా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబందించిన తాజా కీల‌క అంశాలు ఇలా ఉన్నాయి.. 

1) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే బుధవారం రాత్రి రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. వెంట‌నే గవర్నర్ కూడా రాజీనామాను ఆమోదించారు. అయితే, కొత్త‌గా ప్ర‌భుత్వ ఏర్పాటు జ‌రిగే వ‌ర‌కు ఆయ‌న ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా కొన‌సాగాల‌ని గ‌వ‌ర్న‌ర్ కోరారు. 

2) త‌న రాజీనామా లేఖ‌ను స‌మ‌ర్పించ‌డానికి ఉద్ధ‌వ్ థాక్రే స్వయంగా త‌న కుమారుడు ఆదిత్య ఠాక్రేతో రాజ్‌భ‌వ‌న్ కు కలిసి వెళ్లి వచ్చారు. గురువారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు సుప్రీంకోర్టు అనుమతించిన కొద్ది నిమిషాల  త‌ర్వాత ఉద్ధ‌వ్ థాక్రే త‌న ప‌దవికీ రాజీనామా చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. 

3) అంత‌కుముందు గ‌వ‌ర్న‌న్ ప్లోర్ టెస్టు కు ఆదేశాలు ఇవ్వ‌డంపై శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు సవాల్ చేసిన పిటిష‌న్‌పై స్టే ఇవ్వడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు..  మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షకు బుధవారం అనుమతి ఇచ్చింది. 

4) ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అంద‌రిచూపు ఇప్పుడు బీజేపీపై ఉంది. ఈ క్ర‌మంలోనే  బీజేపీ రాష్ట్ర నాయకుడు, మాజీ సీఎం  దేవేంద్ర ఫడ్నవీస్ మరియు తిరుగుబాటు శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండే రాష్ట్ర ప్ర‌భుత్వం ఏర్పాటుపై తదుపరి నిర్ణ‌యం తీసుకుంటార‌ని రాష్ట్ర బీజేపీ  చీఫ్ చంద్రకాంత్ పాటిల్ బుధవారం రాత్రి చెప్పారు.

5) మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత పలువురు బీజేపీ శాసనసభ్యులు మరియు సీనియర్ నాయకులు దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యిలోని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసంలో సమావేశమయ్యారు. శివసేన నేతృత్వంలోని మ‌హా వికాస్ అఘాడీ స‌ర్కారు కూలిపోవడంపై బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్‌తో సహా పలువురు నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకోవ‌డం గ‌మ‌నార్హం. 

6) మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పత్రాన్ని బుధవారం రాత్రి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించిన తర్వాత ఉద్ధవ్ థాక్రే ముంబ‌యిలోని ఒక దేవాల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ స‌మ‌యంలో ఉద్ధవ్ థాక్రేతో పాటు కుమారులు ఆదిత్య థాక్రే, తేజస్ థాక్రే  కూడా ఉన్నారు. 

7) ఉద్ధవ్ థాక్రే రాజీనామా తర్వాత ఫ్లోర్ టెస్ట్ అవసరం లేదు కాబట్టి.. నేడు ముంబ‌యికి చేరుకోనున్న తిరుగుబాటు నేత‌లు ఇప్పుడు రావాల్సిన అవ‌స‌రం లేద‌నీ, నేరుగా ప్ర‌మాణ‌స్వీకారం రోజు రావాల‌ని బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ కోరారు.

8) అంత‌కుముందు ప్లోర్ టెస్ట్ కోసం ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి ప్ర‌త్యేక ఫ్లైట్ లో గౌహతి నుంచి గోవా చేరుకున్నారు. దబోలిమ్ విమానాశ్రయం నుంచి పనాజీలోని హోటల్‌కు కోచ్‌లలో ప్రయాణిస్తున్న వారికి గట్టి భద్రత కల్పించారు.

9) గోవాకు వెళ్లే ముందు ఏక్‌నాథ్ షిండే విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ.. త‌న గ్రూప్ లో ఉన్నవారే నిజ‌మైన శివ‌సేన సైనికుల‌ని పేర్కొన్నారు. తిరుగుబాటుదారులు అని పిల‌వ‌డంపై అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తామ బాలాసాహేబ్ శివ‌సైనికుల‌మ‌ని తెలిపారు. తాము హిందుత్వ భావ‌జాలాన్ని ముందుకు తీసుకువెళ్తామ‌ని చెప్పారు. 

10) రాష్ట్రంలో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ నేతలు గవర్నర్‌ను కలవనున్నార‌ని స‌మాచారం. మాజీ ముఖ్య‌మంత్రి దేవేంద్ర‌ ఫడ్నవీస్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రమాణ స్వీకారం త్వరలో జరగవచ్చని ఒక అధికారి తెలిపారు. ఈ విష‌యంపై ఇప్ప‌టికే శివ‌సేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు,  బీజేపీ నాయ‌కులు చ‌ర్చించార‌ని స‌మాచారం. 
 

Follow Us:
Download App:
  • android
  • ios