Asianet News TeluguAsianet News Telugu

Maharashtra Political Crisis: "బాలా సాహెబ్ హిందుత్వ విజ‌యం".. సుప్రీం ఆదేశాల‌పై షిండే హర్షం

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది.  తిరుగుబాటు ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయొద్ద‌ని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయ‌డంపై తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే హ‌ర్షం వ్య‌క్తం చేశారు.`బాలాసాహెబ్ హిందుత్వ‌కు విజ‌యం` గా ఆయ‌న అభివ‌ర్ణించారు.
 

Maharashtra Political Crisis A Win For Balasahebs Hindutva Eknath Shinde Claims Sena Legacy After Relief From Supreme Court
Author
Hyderabad, First Published Jun 28, 2022, 12:21 AM IST

Maharashtra Political Crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. సోమ‌వారం నాడు ఈ విష‌యం సుప్రీం కోర్టు మెట్టెక్క‌డంతో మ‌రింత ఉత్కంఠ భ‌రితంగా మారింది. ఈ క్ర‌మంలో  శివసేన నేృత్వంలోని సంకీర్ణ కూటమి మహా వికాస్ అగాడీ అసెంబ్లీలో మెజార్టీ కోల్పోగా.. మ‌రో వైపు తిరుగుబాటు ఎమ్మెల్యేల సంఖ్య పెరిగింది. ఇదే త‌రుణంలో మహారాష్ట్రలో అధికారం తమదేంటూ బీజేపీ నాయకులు చెబుతున్నారు. కేవ‌లం ఈ రెండు,మూడు రోజులు మాత్రమే ప్రతిపక్ష హోదాలో ఉండబోతున్నట్లు బీజేపీ నేత‌లు పేర్కొంటున్నారు. మ‌రోవైపు రాష్ట్రపతి పాలన విధించే అవకాశాలు లేక‌పోలేద‌నే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.
 
మ‌హారాష్ట్ర‌లో జ‌రిగిన కీల‌క పరిణామాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది. రెబెల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయొద్ద‌ని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు. సీఎం ఉద్దవ్ ఠాక్రే మీద తిరుగుబాటు చేసిన శివసేన పార్టీ ఎమ్మెల్యేలకు, ఆ పార్టీ రెబల్ లీడర్ ఏక్ నాథ్ షిండేకి సుప్రీంకోర్టు అనుకూల నిర్ణయాన్ని వెలువ‌రించింది. రెబ‌ల్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండేతో పాటు శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని భావించిన  మహా స‌ర్కార్ కు భంగ‌పాటు  జ‌రిగింది. సీఎం ఉద్ద‌వ్ ఆదేశాలతో ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ మీద ఒత్తిడి పెరిగింది. డిప్యూటీ స్పీకర్ శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యాలని ప్రయత్నించారు.

ఈ నిర్ణ‌యంపై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు జారీ చేసింది. శివసేన రెబల్ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వెయ్యకుండా స్టే విధించింది. వ‌చ్చేనెల 11 వ‌ర‌కు రెబెల్ ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయొద్ద‌ని సుప్రీంకోర్టు జారీ చేసింది. ఇదే సమయంలో మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

రెబల్‌ ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో తాత్కాలిక ఉపశమనం లభించడంపై రెబ‌ల్ లీడ‌ర్ ఏక్ నాథ్ షిండే సంతోషం వ్య‌క్తం చేశారు. ఇది బాలా సాహెబ్ హిందుత్వ‌  విజయమని అన్నారు. ఈ మేరుకు ఏక్‌నాథ్‌ షిండే త‌న ట్విటర్ ఖాతా వేదిక స్పందించారు. ‘ఇది హిందూ హృదయ సామ్రాట్ బాలాసాహెబ్ ఠాక్రే హిందుత్వ విజయం. ధర్మవీర్ ఆనంద్ దిఘే ఆలోచనల విజయం’ అని ట్వీట్ చేశారు. అలాగే.. రియ‌ల్ శివ‌సేన విన్స్ #realshivsenawins అనే హ్యష్‌ట్యాగ్‌ జతచేశారు.

మ‌హారాష్ట్ర‌లోని ఉద్ధ‌వ్ ఠాక్రే సార‌ధ్యంలోని మ‌హా వికాస్ అఘాడీ (ఎంవీఏ) స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా షిండే సార‌ధ్యంలో శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు. ఈ క్ర‌మంలో షిండే తమ మీద అనర్హత వేటు వెయ్యకుండా ఆదేశాలు జారీ చెయ్యాలని, శివసేనకు చెందిన మెజారిటీ ఎమ్మెల్యేలు మావైపు ఉన్నారని సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios