మహారాష్ట్రలో అల్లర్లకు కుట్ర పన్నారా? ఇటీవలే దేశంలోని పలురాష్ట్రాల్లో జరిగిన అల్లర్లు ఆందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం మహారాష్ట్ర పోలీసులు దూలేలో ఓ స్కార్పియో కారులో 89 తల్వార్లు, ఒక పెద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురుని అరెస్టు చేశారు.
ముంబయి: ఇటీవలి కాలంలో అసహనం పెరిగిపోతున్నది. దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో ఆందోళనకర పరిస్థితులు చూశాం. మత ఘర్షణలు ఈ ఆందోళనలను రెట్టింపు చేశాయి. కత్తులు, తల్వార్లతో కొందరు యువకులు చేసిన వీరంగం వీడియోల్లో కనిపించింది. ఇప్పుడు ఆ అల్లర్ల కథ ముగిసిందని భావిస్తున్న తరుణంలో మహారాష్ట్రలో మరో అలజడి సృష్టించే వార్త వచ్చింది. ఓ వాహనంలో పెద్ద మొత్తంలో తల్వార్లు, ఓ పెద్ద కత్తి లభించాయి. అంటే.. మహారాష్ట్రలోనూ ఏదైనా అలజడి, అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరిగాయా? అనే అనుమానాలు వస్తున్నాయి.
మహారాష్ట్ర పోలీసులు గురువారం ఉదయం ధూలేలో ఓ స్కార్పియో వాహనంలో సుమారు 90 తల్వార్లను స్వాధీనం చేసుకున్నారు. ముంబయి - ఆగ్రా రహదారిపై ఆ వాహనాన్ని ఆపారు. ఆ స్కార్పియో రాజస్తాన్‌లోని చిత్తోడ్‌గడ్ నుంచి మహారాష్ట్రలోకి వచ్చినట్టు తెలిసింది. ధూలే పోలీసులు ఆ వాహనాన్ని సోంగిర్ గ్రామానికి చెందినదిగా గుర్తించారు. ఆ వాహనంలో సెర్చ్ చేయగా 89 తల్వార్లు, ఒక పెద్ద కత్తి లభించినట్టు వివరించారు. అనంతరం తాము నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు. వారిని కస్టడీలోకి తీసుకుని విచారించడానికి కోర్టును అనుమతి కోరనున్నారు.
కాగా, నిందితులు తాము జాల్నా జిల్లాకు చెందినవారమని చెప్పుకున్నారు. వాటిని వాహనంలో పెట్టుకుని ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయంపై క్లారిటీ లేదని పోలీసులు తెలిపారు. అయితే, ఆ తల్వార్లను ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? అక్కడే కొనుగోలు చేసి ఉంటే వాటికి అవసరమైన అనుమతులు వారు పొందారా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉండగా, రాజకీయ నాయకులు పరస్పరం విమర్శలు మొదలుపెట్టారు.
ఔరంగాబాద్, జాల్నా జిల్లాలు మహారాష్ట్రలో సున్నితమైన ప్రాంతాలు.
ఈ ఘటనపై బజేపీ లీడర్ రామ్ కాదమ్ మాట్లాడారు. ఒక కాంగ్రెస్ పాలిత రాష్ట్రం నుంచి వీటిని ముబయిలోకి ఎందుకు తెచ్చారు. మహారాష్టలో ఎవరిపైనా అయినా దాడి చేయడానికా లేదా ఘర్షణలు సృష్టించడానికా? అంటూ ప్రశ్నించారు. మరో బీజేపీ నేత అశిశ్ శెలార్ ప్రశ్నించారు. ర్యాలీలో కత్తి చూపెట్టినందుకే ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రేపైననే కేసు నమోదు చేసిన ప్రభుత్వం.. మరి ఈ సారి భారీ స్థాయిలో తల్వార్లు లభించాయని, మరి వాటికి బాధ్యులుగా పేర్కొంటూ రాష్ట్ర హోం మంత్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయగలరా? అని అశిశ్ షెలార్ ప్రశ్నించారు.
కాగా, అధికారపక్షంలోని కాంగ్రెస్ ఈ విమర్శలకు సమాధానం చెప్పింది. పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారని, ఈ కత్తులు కటార్లు మన రాష్ట్రంలోకి ఎందుకు తెచ్చారో త్వరలోనే వెల్లడి అవుతుందని కాంగ్రెస్ నేత అతుల్ లోండే వివరించారు.
