మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్​ తగిలింది. శివసేన కీలక నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే.. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే 11 మంది పార్టీ ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్‌కు వెళ్లినట్టుగా సమాచారం. 

మహారాష్ట్రలోని మహా వికాస్​ అఘాడీ ప్రభుత్వానికి భారీ షాక్​ తగిలింది. శివసేన కీలక నేత, రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే.. సీఎం ఉద్దవ్ ఠాక్రేకు షాక్ ఇచ్చేందుకు సిద్దమైనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఏక్‌నాథ్ షిండే 11 మంది పార్టీ ఎమ్మెల్యేలతో గుజరాత్‌లోని సూరత్‌లోని ఓ హోటల్‌కు వెళ్లినట్టుగా సమాచారం. వీరంతా శివసేనపై తిరుగుబావుట ఎగరవేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ఏక్‌నాథ్ షిండే‌తో పాటు సూరత్ వెళ్లిన ఎమ్మెల్యేలు.. బీజేపీ గుజరాత్​ అధ్యక్షుడు సీఆర్​ పాటిల్​తో టచ్​లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక, తన వెంట 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా ఏక్‌నాథ్ షిండే చెబుతున్నారు.

మరోవైపు ప్రస్తుతం శివసేన వర్గాలకు ఏక్‌నాథ్ షిండే అందుబాటులో లేడని సమాచారం. ఈ పరిణామం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వంలో ప్రమాద ఘంటికలు మోగించే సూచనలు కనిపిస్తాయి. ఇక, షిండే ఈ రోజు మధ్యాహ్నం మీడియాతో మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు సూరత్‌లో ఏక్‌నాథ్ షిండే‌తో పాటు పలువురు శివసేన ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ పరిసరాల్లో గుజరాత్ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడ దాదాపు 500 మంది పోలీసులను మోహరించారు. రిసార్ట్‌లోకి ఎవరిని అనుమతించడం లేదు. 

ఇక, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఎమ్మెల్యేలతో మంగళవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే హాజరు కావాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి. అయితే ఏక్‌నాథ్ షిండే పలువురు ఎమ్మెల్యేలను తీసుకుని గుజరాత్ వెళ్లిన నేపథ్యంలో వారు ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశం లేదు. ఈ పరిణామాలపై కూడా శివసేన ఎమ్మెల్యేలతో జరిగే భేటీలో సీఎం ఉద్దవ్ ఠాక్రే చర్చించే అవకాశం ఉంది. 

ఏక్‌నాథ్ షిండే థానేలో శివసేన ముఖ్య నాయకుడు. ఈ ప్రాంతంలో సంస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. మాస్ లీడర్‌గా పేరు పొందిన షిండే.. 2014లో బీజేపీతో శివసేన విడిపోయిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపికయ్యారు. మహా వికాస్ అఘాడి ప్రభుత్వం ఏర్పడినప్పుడు.. అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ అండర్‌టేకింగ్స్) మంత్రిగా నియమించబడ్డారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంవీఏ కూటమికి షాక్.. 
మహారాష్ట్రలో రాజ్యసభ ఎన్నికల తర్వాత.. తాజాగా శాసన మండలి ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి (MVA)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో బీజేపీకి చెందిన ఐదుగురు అభ్యర్థులు విజయం సాధించారు. మరోవైపు ఎంవీఏ కూటమిలోని ఎన్సీపీ, శివసేన లు చెరో రెండు స్థానాల‌ను గెలుచుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఒక్క‌రూ విజయం సాధించారు. బీజేపీ తరపున శ్రీకాంత్ భారతీయ, ప్రవీణ్ దారేకర్, ఉమా ఖాప్రే, ప్రసాద్ లాడ్, రామ్ షిండే విజయం సాధించారు. శివసేన అభ్యర్థులు సచిన్ అహిర్, అంశ్య పద్వీ, ఎన్సీపీ నుంచి ఏక్నాథ్ ఖడ్సే, రాంరాజే నాయక్ నింబాల్కర్ విజయం సాధించారు.

ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, శివసేన ఓట్లలో చీలిక ఏర్పడినట్లు స్పష్టమవుతోంది. బీజేపీకి నలుగురు ఎమ్మెల్సీ అభ్యర్థులు గెలిపించుకునే బలం (106 మంది ఎమ్మెల్యేలు) మాత్రమే ఉన్నప్పటికీ.. వ్యుహాత్మకంగా ఐదుగురు అభ్యర్థులను బరిలో నిలిపి గెలిపించుకుంది. ఎంవీఏ కూటమిలో శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల నుంచి ఇద్దరు చొప్పున.. మొత్తం ఆరుగురు బరిలో నిలిచిన ఐదుగురు మాత్రమే విజయం సాధించారు. కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన చంద్రకాంత్​ హండోర్​ ఓడిపోయారు. అయితే బీజేపీ మొత్తం 134 ఓట్లు వచ్చాయని బీజేపీ సీనియర్ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

దీంతో బీజేపీకి అదనంగా వచ్చిన ఓట్లలో స్వతంత్ర అభ్యర్థులతో పాటు అధికార పక్షానికి చెందినవారిని ఉంటాయనే ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ షిండే‌ తిరుగుబావుట ఎగరవేయడం చర్చనీయాంశంగా మారింది.