ఇటీవల కురిసిన భారీ వర్షాలు పలు రాష్ట్రాల్లో వరదలు పొంగి పొర్లుతున్నాయి. ఈ వరదల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కనీసం తినడానికి తిండి, తాగడానికి నీరు కూడా దొరకక చాలా మంది అవస్థలు పడుతున్నారు. కాగా... బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఓ మంత్రి... ఆ విషయం మర్చిపోయి.. సెల్ఫీలకు ఫోజులు ఇవ్వడం గమనార్హం. దీంతో సదరు మంత్రి పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ సంఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం మహారాష్ట్రను వరదలు ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. కాగా సంగ్లీ జిల్లాలో వరద ప్రభావానికి నీట మునిగిన ప్రాంతాలను పరిశీలించేందుకు ఆ రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ వెళ్లారు. అక్కడ రోడ్లు, ఇళ్లు తీవ్రంగా దెబ్బదినడంతో వేలమంది నిరాశ్రయులయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రి పడవపై ప్రయాణిస్తూ సెల్ఫీలకు  ఫోజులిచ్చారు.

పడవలో ప్రయాణిస్తూ ఆనందంగా చేతులు ఊపుతూ కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. అంతే.. ఆ వీడియోని చూసి నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై ఎన్సీపీ నాయకుడు ధనుంజయ్ ముండే స్పందించారు. మంత్రి గిరీష్ మహాజన్ పై సీఎం ఫడణవీస్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నెటిజన్లు మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ వీడియో ప్రభావం త్వరలో రానున్న ఎన్నికలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. మంత్రి పర్యటనకు వెళ్లిన ప్రాంతంలో వరదల కారణంగా ఇప్పటికే 14మంది చనిపోవడం గమనార్హం.