ప్రాణం తీసిన ప్రేమ.. మహారాష్ట్రలోని లాతూర్‌లో  మాట్లాడుదామంటూ ఇంటికి పిలిచి యువకుణ్ని కొట్టిచంపేశారు యువతి కుటుంబసభ్యులు. ప్రియురాలి ఇంటికెళ్లిన యువకుడ్ని కర్రలతో దాడి చేసి చచ్చేలా కొట్టారు. నమ్మి ప్రియురాలి ఇంటికెళ్లిన  ప్రేమికుడు శవమై తేలాడు.

మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. అమ్మాయిని ప్రేమించాడనే కారణంతో ఓ యువకుడిని కొట్టి చంపిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రెండు వారాల క్రితం జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔసా తహసీల్‌కు చెందిన 25 ఏళ్ల బలిరామ్ మగర్‌ను తన భాడా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జూన్ 3న చర్చ కోసం పిలిచాడని, ఆపై అతను తన కుటుంబ సభ్యులతో కలిసి బలిరామ్‌ను దారుణంగా కొట్టాడని పోలీసు అధికారి తెలిపారు. వారి దెబ్బలకు తట్టుకోలేక అదే రోజు రాత్రి బలిరామ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

జూన్ 9న దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో జూన్ 10న హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. పల్లెటూరి అమ్మాయితో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నందుకు బలిరామ్‌ను కొట్టినట్లు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అప్పాసాహెబ్ డోంగ్రే తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకూ ఏడుగురు నిందితుల్లో ఐదుగురిని అరెస్టు చేశామనీ, మిగితా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని, అదే సమయంలో కేసు విచారణ జరుగుతోందని అన్నారు.