KCR: మహారాష్ట్రలో కేసీఆర్ దూకుడు.. భారీగా బీఆర్ఎస్ లోకి చేరికలు
Solapur: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కాంగ్రెస్, బీజేపీల తీరుపై మండిపడుతూ.. దేశాన్ని దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ పాలించిందనీ, మహారాష్ట్రలో ప్రజలు కాంగ్రెస్, శివసేన, బీజేపీలకు అవకాశం ఇచ్చారు కానీ తెలంగాణలో సాధించిన అభివృద్ది మహారాష్ట్రలో ఎందుకు సాధ్యం కాలేదని ప్రశ్నించారు. తమ పార్టీ రైతుల పక్షాన, పేదల పక్షాన నిలుస్తుందని తెలిపారు.
KCR's strong counter to Congress, BJP: తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి నాయకుడు కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) తన పార్టీ విస్తరణ విషయంలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు. పక్కా వ్యూహాలతో కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. మహారాష్ట్రపై కన్నేసిన కేసీఆర్.. అక్కడ బీఆర్ఎస్ విస్తరణలో మరింత వేగం పెంచారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో కేసీఆర్ సమక్షంలో చాలా మంది ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
వివరాల్లోకెళ్తే.. పలువురు మహారాష్ట్ర నేతలు మంగళవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు. రెండు రోజుల మహారాష్ట్ర పర్యటనలో ఉన్న కేసీఆర్ పండరీపూర్ లోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని సందర్శించారు. భరత్ రాష్ట్ర సమితి నాయకుడు, ఆయన మంత్రివర్గ సహచరులు సోమవారం భారీ కాన్వాయ్ తో మహారాష్ట్రకు వెళ్లారు. నేడు పండరీపూర్ చేరుకున్న కేసీఆర్.. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ సందర్భంగా పలువురు ఇతర పార్టీల నేతలు బీఆర్ఎస్ లోకి వచ్చారు. అలాగే, షోలాపూర్ లో జరిగిన బహిరంగ సభలో కొత్త సభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. బీఆర్ఎస్ లో చేరిన నేతల్లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) మాజీ నేత భగీరథ్ భాల్కే కూడా ఉన్నారు. ఆయన తండ్రి, మాజీ ఎమ్మెల్యే భరత్ భాల్కే మరణంతో ఎన్సీపీ ఆయనను బరిలోకి దింపింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చెందిన సమధాన్ ఔదాటే చేతిలో భగీరథ్ ఓడిపోయారు.
ఈ క్రమంలోనే కేసీఆర్ మాట్లాడుతూ.. మహారాష్ట్ర రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినప్పటికీ రాష్ట్రాల్లోని పార్టీలు బీఆర్ఎస్ కు ఎందుకు భయపడుతున్నాయని కేసీఆర్ ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ లకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "తాము బీజేపీకి బీ టీం అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్ కు ఏ టీం అని బీజేపీ ఆరోపిస్తోంది. అయితే, బీఆర్ఎస్ ఏ పార్టీకి టీం కాదు. రైతులు, దళితులు, బీసీలు, పేద ప్రజలే మా టీం. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి. అందుకే దేశంలో రైతు ప్రభుత్వం రావాల్సివుందని" తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు.
తన నాయకత్వంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చాటిచెప్పే క్రమంలో కేసీఆర్ ప్రసంగంలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాల గురించి పలు ప్రస్తావనలు ఉన్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సినవి ఇవ్వలేకపోయాయని ఆరోపిస్తూ రైతు సమస్యలను గురించి ప్రస్తావించారు. అందుకే అబ్‌కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ మాదిరిగా దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎందుకు అభివృద్ది సాధ్యం కాదని ప్రశ్నించారు. తెలంగాణలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమైనపుడు మహారాష్ట్రలో ఎందుకు కాదన్నారు. పుష్కలంగా వనరులు ఉన్నప్పటికీ అభివృద్ది విషయంలో మహారాష్ట్ర ఇలా ఉండాల్సింది కాదనీ, మరింత అభివృద్ది చెందాల్సి ఉండాలని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు గడిచిపోయాయనీ, అయితే, అభివృద్ది వ ఎలా ఉందనేది ప్రజలు ఆలోచించాలన్నారు. అభివృద్ది విషయంలో చైనా ఎక్కడుంది? భారత్ ఎక్కడుంది అని ప్రశ్నించారు.