దేశంలో కరోనా వైరస్‌కు హాట్ స్పాట్‌గా వున్న మహారాష్ట్రలో వైరస్‌ను నియంత్రించేందుకు గాను అక్కడి ప్రభుత్వం లాక్‌డౌన్‌ తరహా ఆంక్షలు విధించాలని భావిస్తోంది. సీఎం ఉద్ధవ్ థాక్రే సైతం ఈ అంశంపై ఆలోచించి కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.  

ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై ఆధారపడకుండా ప్రజలు స్వయంగా టెస్టులు చేయించుకోవాలని మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్‌ తోపే కోరారు. ప్రజలు ఆలస్యంగా టెస్టులు చేయించుకుంటున్న కారణంగా.. ఆస్పత్రుల్లోని ఐసీయూల్లో ఆక్సిజన్‌ పడకలు వేగంగా నిండిపోతున్నాయని అన్నారు.

కాబట్టి ప్రజలు కరోనా లక్షణాలు అనిపిస్తే.. వెంటనే తమంతట తాము వచ్చి పరీక్షలు చేయించుకోవాలని రాజేశ్‌ సూచించారు. ఎన్సీపీ నేత నవాబ్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రస్తుతం లాక్‌డౌన్‌ విధించలేమని తేల్చి చెప్పారు.

కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ కాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని తాను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని వెల్లడించారు. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌ నిబంధనలు పాటిస్తే లాక్‌డౌన్‌తో పని ఉండదని మాలిక్‌ అభిప్రాయపడ్డారు.

కాగా, రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు నిబంధనలు పాటించకపోతే లాక్‌డౌన్‌ను  పరిశీలించాల్సి వస్తుందని సీఎం హెచ్చరించిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 27వేలకు పైగా కేసులు నమోదవ్వగా 139 మంది ప్రాణాలు కోల్పోయారు.

మరోవైపు వైరస్ నేపథ్యంలో మార్కెట్లలో రద్దీని కట్టడి చేసేందుకు నాసిక్‌ అధికారులు వినూత్న ప్రయోగం చేపట్టారు. మార్కెట్లలోకి వెళ్లడానికి ప్రజలు గంటకు రూ.5 చెల్లించేలా టికెట్‌ను నిర్ణయించారు. దీనిపై నగర పోలీస్‌ కమిషనర్ మాట్లాడుతూ.. పరిస్థితి లాక్‌డౌన్‌ వరకూ వెళ్లకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.