మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ తీసుకురావడంతో పాటు పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ సైతం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో మహా ప్రభుత్వం మరిన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.

ఈ సారి నిత్యావసరాలపై కూడా ఆంక్షలు విధించింది. కిరాణాలు, కూరగాయలు, పండ్లు తదిరత నిత్యావసర వస్తువులు విక్రయించే దుకాణాలు కేవలం 4 గంటల పాటే తెరవాలని ఆదేశించింది. అలాగే రాత్రి 8 తర్వాత హోం డెలివరీని కూడా నిలిపివేసింది. ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.   

ఈ దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటాయని... హోం డెలివరీలు ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

Also Read:మహారాష్ట్రలో లాక్‌డౌన్ ఉండదు: ఉద్ధవ్ థాక్రే సంచలన నిర్ణయం

తాజా ఆంక్షలు నేటి రాత్రి 8 గంటల నుంచి మే 1వ తేదీ ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాష్ట్రంలో కర్ఫ్యూ అమల్లోకి ఉన్నప్పటికీ నిత్యావసర సరుకుల పేరుతో చాలా మంది జనం బయటకు వస్తున్నారని, దీంతో రద్దీని అదుపు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 

కాగా, మహారాష్ట్రలో కరోనా అదుపు లేకుండా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఏప్రిల్‌ 14 రాత్రి నుంచి జనతా కర్ఫ్యూ పేరుతో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది ఉద్ధవ్ సర్కార్. కూరగాయలు, కిరాణా దుకాణాలు, ఆహారశాలలు తదితర నిత్యావసరాలకు మాత్రం మినహాయింపు కల్పించింది.