కరోనా కట్టడికి ప్రపంచమంతా అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. కేసుల విషయంలో ప్రపంచంలోనే అత్యధికంగా ఎపెక్ట్ అయిన భారత్ లో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా అనుకున్న స్తాయిలో కట్టడిలోకి రావడం లేదు. ఈ నేపత్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

పల్లెలకూ ఎగబాకుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రోత్సాహకాన్ని బుధవారం ప్రకటించింది. మహమ్మారిని తరిమికొట్టడంలో విజయం సాధించే గ్రామాలకు రూ. 50 లక్షల పారితోషికాన్ని అందజేస్తామని ఆ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి హసన్ ముష్రిఫ్ తెలిపారు. 

కోవిడ్ నియంత్రణలో సమర్థంగా వ్యవహరించిన గ్రామాలను ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ఇటీవల ప్రశంసించారు. మిగిలిన అన్ని గ్రామాలను కూడా ఈ దిశగా నడిపించేందుకు ‘కరోనా ఫ్రీ విలేజ్’ పేరుతో పోటీని నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 

ప్రతి రెవిన్యూ డివిజన్ నుంచి అత్యుత్తమ కట్టడి చర్యలు తీసుకున్న మూడు గ్రామాలను ఎంపిక చేస్తామని ప్రథమ స్థానంలో నిలిచిన గ్రామానికి రూ. 50 లక్షలు, ద్వితీయ స్థానం పొందిన గ్రామానికి రూ. 25 లక్షలు, తృతీయ స్థానం పొందిన గ్రామానికి రూ. 15 లక్షల నగదు అందజేస్తామన్నారు.

రాష్ట్రంలో మొత్తం ఆరు రెవిన్యూ డివిజన్లు ఉన్నాయని, 18 బహుమతులకు రూ.5.4కోట్లు కేటాయించినట్లు వివరించారు. విజేతగా నిలిచిన గ్రామాలకు ఫ్రైజ్ మనీకి అదనంగా అంతే మొత్తాన్ని ప్రోత్సాహకంగా అందజేస్తామని, స్థానికంగా అభివృద్ధి పనులకు దీనిని వినియోగించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విజేతను నిర్ణయించడానికి 22 అంశాలు ప్రాతిపదికగా ఉంటాయన్నారు.