గవర్నర్ ఆదేశాల మేరకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతోంది. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య సభలో చర్చ ప్రారంభమైంది. అయితే ప్రభుత్వంపై బీజేపీ శాసనసభాపక్షనేత దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు కురిపించారు.

గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని... కానీ ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

Also Read:తెరపైకి శివాజీ.. హిందుత్వ స్థానేనా లౌకికత్వం..ఆసక్తికరంగా మహా రాజకీయం

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా జాతీయ గీతాన్ని సైతం ఆలపించలేదని ఫడ్నవీస్ మండిపడ్డారు. కాగా కాళిదాసు స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించిన సంగతి తెలిసిందే. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. దాదర్‌లోని శివాజీ పార్క్‌లో ఆయనతో గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ప్రమాణం చేయించారు.

ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్ థాక్రే, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ హాజరయ్యారు. 

ఉద్దవ్‌తో పాటు శివసేన నుంచి ఏక్‌నాథ్ ముండే, సుభాష్ దేశాయ్.. ఎన్సీపీ నుంచి చగన్ భుజ్జల్, జయంత్ పాటిల్.. కాంగ్రెస్ నుంచి బాలాసాహెబ్, నితిన్ రౌత్ మంత్రులుగా ప్రమాణం చేశారు.

శివసేన అధికారిక పత్రిక సామ్నా ఎడిటర్ ఇన్ చీఫ్ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ఉద్థవ్ వెల్లడించారు. సామ్నా పత్రికను శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే 1988లో స్థాపించారు. అప్పటి నుంచి పార్టీకి గొంతుకగా సామ్నా మారిపోయింది.

ఈ పత్రిక వ్యవహారాలన్నీ ఇప్పటి వరకు ఉద్ధవ్ థాక్రేనే చూసుకునేవారు. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తుండటంతో పదవిలో ఉండటం భావ్యం కాదని భావించిన ఉద్థవ్ ఆ బాధ్యతలను పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్‌కు అప్పగించారు. 

Also Read:సీఎంగా ఉద్థవ్ థాక్రే బాధ్యతలు: తర్వాతి రోజే ఫడ్నవీస్‌కు కోర్టు సమన్లు

ఎన్సీపీకి ఎదురుతిరిగి బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం కూడా చేసిన అజిత్, తన వర్గం ఎమ్మెల్యేలు  కలిసిరాకపోవడంతో, పవార్‌ కుటుంబసభ్యులు ఒత్తిడి తేవడంతో తిరిగి సొంత గూటికే చేరారు. చేసిన తప్పు ఒప్పుకున్నారు. మళ్లీ సొంతగూటికి చేరిన అబ్బాయిని బాబాయ్‌ శరద్‌ పవార్‌ కూడా క్షమించారు, గ్రాండ్ వెల్కమ్ కూడా చెప్పారు.