నగరంలో నివాసముంటున్న ప్రజలు ఉల్లిని అధిక ధరకు కొనుగోలు చేయాల్సి వస్తున్నా.. ఆ పంటను పండించే  రైతులకు మాత్రం సరైన ప్రయోజనం లభించడం లేదు. ఐదు క్వింటాళ్ల ఉల్లిని అమ్మితే వచ్చే నికర లాభం రెండున్నర రూపాయలు వచ్చింది. మహారాష్ట్ర ఉల్లి రైతు పరిస్థితి కడు దయనీయంగా  మారింది.  

దేశంలో రైతుల పరిస్థితి మరి దయనీయంగా మారింది. కొనబోతే కొరివి.. అమ్మబోతే అడవి అన్నట్టుగా మారింది. ఎండనక.. వాననక ఆరుగాలం కష్టపడి నాణ్యమైన పంట పండించిన .. సరైన గిట్టుబాటు ధరలేక.. కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా పొందలేని పరిస్థితి. ఎన్నోఆశలతో ఓ రైతు ఉల్లిసాగు చేయగా.. సరిగ్గా పంట చేతికొచ్చే సమయానికి ధరలు పడిపోయాయి. మరి ఎంతగా అంటే.. కనీసం పెట్టుబడులు కూడా రావడం లేదు. ఐదు క్వింటాలకుపైగా ఉల్లిగడ్డ అమ్మిన రైతన్నకు .. అన్ని ఖర్చులు పోనూ చేతికి రెండు రూపాయాలు వచ్చాయి. ఈ కడు దయనీయమైన పరిస్థితిని మహారాష్ట్రలోని ప్రతి ఉల్లి రైతు ఎదుర్కొంటున్నాడు.

వివరాల్లోకెళ్తే.. షోలాపూర్‌ జిల్లా బోరగావ్ గ్రామానికి చెందిన రాజేంద్ర చవాన్‌ (58)అనే రైతు ఉల్లి సాగుచేశారు. తన పొలంలో సాగు చేసిన ఉల్లిని ఫిబ్రవరి 17న షోలాపూర్ మార్కెట్‌కు తీసుకెళ్లారు. అయితే.. ఉల్లి ధరలు చాలా దారుణంగా పడిపోయాయి. ఎంత దారుణమంటే.. కిలో ఉల్లిపాయలను కేవలం రూ.1 చొప్పున కొనుగోలు చేస్తామని వ్యాపారులు చెప్పారు. ఎన్నో ఆశలతో వచ్చిన రైతులకు ఊహించని పరిణామం ఎదురైంది. ఏం చేయాలో అర్థం కాక.. కంటతడి పెట్టుకున్నాడు. మార్కెట్ కు తెచ్చిన పంటను తిరిగి ఇంటికి తీసుకెళ్లలేదు. ఆ ధరకు అమ్మడానికి మనసు రావడం లేదు. చివరికి గత్యంతర లేక .. ఆ రైతు తాను తెచ్చిన మొత్తం 512 కిలోల ఉల్లిని కేవలం రూ.512లకు అమ్మేశారు. 

కనీసం చేతికి ఓ ఐదువందలైన వస్తాయని భావించిన ఆ రైతుకు నిరాశే ఎదురైంది. పంటను పొలం నుంచి మార్కెట్ కు తీసుకరావడానికి రవాణా చార్జీలు, కూలీల ఖర్చు,మార్కెట్‌ రుసుం అన్ని కలిసి మొత్తం రూ.509.51 అయ్యింది. అంటే.. ఆ రైతుకు మిగిలింది రూ.2.49. దాన్ని కూడా రౌండ్‌ ఫిగర్‌ చేసిన మార్కెట్‌ కమిటీ అధికారులు రూ.2 చెక్కును రైతు చేతిలో పెట్టారు. పైగా ఆ చెక్కు కూడా 15 రోజుల తర్వాతనే బ్యాంకులో జమచేసుకోవాలని ముందస్తు తేదీ వేసి ఇవ్వడం గమనార్హం.

ఇలా ఉల్లి సాగుచేసిన ఆ రైతుకు చివరికి కన్నీరే మిగిలింది. పంటకు పెట్టుబడి ఖర్చులు పెరగడం.. ఆరుగాలం అన్ని ఓర్చుకొని పండిన పంటకు కనీస మద్దతు ధర లభించక రైతన్నలు అప్పుల బారిన పడుతున్నారు. ఆ అప్పులు తీర్చలేక తమ జీవితాలను ముగిస్తున్నారు. 

రైతు రాజేంద్ర చవాన్ మాట్లాడుతూ.. ‘‘ఉల్లిపాయలు కిలోకు రూపాయి దక్కింది.. మొత్తం 512 కిలోల ఉల్లి అమ్మితే.. అన్ని ఖర్చులు పోను రెండు రూపాయాలు మిగిలాయి. గత మూడు నాలుగేళ్లలో పెట్టుబడి వ్యయం రెట్టింపు అయ్యింది. అర టన్ను ఉల్లి పండించడానికి దాదాపు.. రూ.40,000 ఖర్చుపెట్టాను’’ అని రైతన్న కన్నీటి పర్యంతమయ్యాడు. రైతు నాయకుడు, మాజీ ఎంపీపీ రాజుశెట్టి మాట్లాడుతూ.. ప్రస్తుతం మార్కెట్‌కు వస్తున్న ఉల్లి ఖరీఫ్‌ పంటనే. ఇది ఎక్కువ కాలం నిల్వ చేయబడదు. ఈ ఉల్లిని వెంటనే మార్కెట్‌లో విక్రయించి ఎగుమతి చేయాలి. కానీ, రాకతో మార్కెట్‌లో ఉల్లి ధరలు పడిపోయాయి.