మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణం చేసిన తర్వాత మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తాము తప్పు చేసి ఉంటే ప్రజలే ఓడిస్తారని అన్నారు. ఎన్నికల గుర్తు ధనస్సు  బాణం శివసేన నుంచి ఎవ్వరూ లాక్కెళ్లలేరని స్పష్టం చేశారు. 

ముంబయి: శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో బీజేపీ మద్దతు ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే తొలిసారి విలేకరులతో సమావేశంలో ఏర్పాటు చేసి మాట్లాడారు. మహారాష్ట్ర అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. శివసేన పార్టీ గుర్తు తమతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ధనస్సు బాణం గుర్త తమతోనే ఉంటుందని వివరించారు. 

ఈ రోజే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని తాను సవాల్ చేస్తున్నట్టు ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. తాము తప్పు చేసి ఉంటే ప్రజలు ఇంటికే పంపిస్తారని వివరించారు. ఒక వేళ ఇదే చేయాలనుకుంటే.. రెండుననరేళ్ల క్రితమే చేసి ఉండాల్సిందని, అది గౌరవంగాననూ ఉండేదని అన్నారు. ఇదంతా జరిగి ఉండేది కాదు కదా అని వివరించారు. శివసేన నుంచి ధనస్సు, బాణం సింబల్‌ను ఎవ్వరూ తీసుకెళ్లలేరని చెప్పారు. అయినా ప్రజలు కేవలం సింబల్‌నే చూడరని, ఆ సింబల్‌ ఎవరి దగ్గర ఉన్నదని చూస్తారని వివరించారు. శివసేనను ఎవరూ తమ నుంచి లాక్కెళ్లలేరని అన్నారు. పార్టీలు పోయినంత మాత్రానా ఎక్కడైనా పార్టీ పోతుందా? అని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో పని చేసే రిజిస్టర్డ్ పార్టీ ఒకటి.. లెజిస్లేచర్ పార్టీ మరోటి ఉంటుందని, ఈ రెండు వేర్వేరు అని వివరించారు.

బీజేపీ తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేసి దాడి చేసినప్పుడు వీరంతా (రెబల్ ఎమ్మెల్యేలు) ఎక్కడ ఉన్నారని అడిగారు. రెండున్నరేళ్లుగా తన కుటుంబంపై బీజేపీ దాడి చేస్తుంటే.. మౌనంగా వారితో చేతులు కలిపి సొంత పార్టీనే మోసం చేశారని విమర్శించారు.

రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. ఇదే శివసేనదే కాదు.. భారత ప్రజాస్వామ్యాన్ని కూడా నిర్ణయిస్తుందని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం పట్ల తాము ఆందోళనగా ఉన్నామని, న్యాయవ్యవస్థపై తమకు నమ్మకం ఉన్నదని అన్నారు. ఈ నిర్ణయంపై అందరూ చాలా ఆత్రుతగా చూస్తున్నారని వివరించారు. మన ప్రజాస్వామ్యం ఎంత పటిష్టమైనదోనని ఎదురు చూస్తున్నారని తెలిపారు. తాను నిర్ణయం గురించి ఆందోళన చెందడం లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని వివరించారు.