Maharashtra political crisis: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం పరిస్థితుల మధ్య అధికారం కోసం బాల్ థాక్రే బోధనలను ఎప్పటికీ వదులుకోను అని ఏక్‌నాథ్ షిండే అన్నారు. తమకు హిందుత్వంపై పాఠాలు చెప్పిన బాలాసాహెబ్‌కు చెందిన గట్టి శివసైనికులం తామని ఏక్‌నాథ్ షిండే ట్వీట్ చేశారు.
Maharashtra political crisis: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభ పరిస్థితుల మధ్య తన పార్టీకి చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో సూరత్‌లో క్యాంప్‌లో ఉన్న శివసేన మంత్రి ఏక్‌నాథ్ షిండే మంగళవారం మాట్లాడుతూ.. తాను ఎప్పటికీ అధికారం కోసం మోసం చేయనని అన్నారు. అలాగే, శివసేన బోధనలను విడిచిపెట్టనని అన్నారు. "మేము హిందుత్వం గురించి మాకు పాఠాలు చెప్పిన బాలాసాహెబ్ బలమైన శివసైనికులం. మేము అధికారం కోసం ఎన్నటికీ మోసం చేయము.. అధికారం కోసం బాలాసాహెబ్, ఆనంద్ డిఘేల బోధనలను ఎప్పటికీ వదులుకోము" అని షిండే మరాఠీలో ట్వీట్ చేశారు. కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై తన మొదటి ప్రతిస్పందన రావడంతో రాజకీయాల్లో మరో కొత్త చర్చ మొదలైంది.
థానేకు చెందిన శివసేనకు చెందిన దివంగత దిఘే షిండేకు రాజకీయ గురువు. షిండే మరియు అధికార శివసేనకు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలు అజ్ఞాతంలోకి వెళ్లి సూరత్‌లో క్యాంప్ చేస్తున్నారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (MVA) సంకీర్ణ ప్రభుత్వంలో NCP, కాంగ్రెస్‌లు ఉన్నాయి. మహారాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హీట్ కలిగించాయి. మళ్లీ అంతలోనే గాడిలో పడుతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే చక్రం తిప్పినట్టు తెలుస్తున్నది. మళ్లీ పరిస్థితులను నిజంగానే శివసేన తమ అదుపులోకి తెచ్చుకున్నట్టు అర్థం అవుతున్నది. గుజరాత్‌లో మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో శివసేన ఎమ్మెల్యేలు క్యాంప్ వేశారు. ఉద్ధవ్ ప్రభుత్వం కూలిపోతుందా? అనే చర్చలు జరిగిన సందర్భంలో సీఎం ఉద్ధవ్ ఠాక్రే అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం జరుగుతుండగా కూడా ఏక్‌నాథ్ షిండేను బుజ్జగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు, ఏకంగా డిప్యూటీ సీఎం పోస్టు కూడా ఆఫర్ చేసినట్టు కొన్ని వర్గాలు చెప్పాయి. ఈ సమావేశంలో శివసేన ఎమ్మెల్యేలు అనుకున్నదాని కంటే ఎక్కువ మంది హాజరు అయినట్టు తెలిసింది. అదే విధంగా ఏక్‌నాథ్ షిండేపైనా శివసేన వేటు వేసింది. పార్టీ చీఫ్ విప్ పదవి నుంచి ఆయనను తొలగించింది. ఏక్‌నాథ్ షిండే స్థానంలో శివసేన ఎమ్మెల్యే అజయ్ చౌదరిని కొత్త శాసన సభా పక్ష నేతగా భర్తీ చేసింది.
అంతకుముందు శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందిస్తూ.. ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతున్నదని తెలిపారు. షిండే తమ పార్టీకి నమ్మకమైన వ్యక్తి అని, త్వరలోనే తమ ఎమ్మెల్యేలు తిరిగి వస్తారని అన్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిని కూల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘నిన్న రాత్రి శాసనమండలి ఎన్నికల తర్వాత నుంచి కొంత మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో లేరు అనేది నిజమే. ఏక్ నాథ్ షిండే ప్రస్తుతం ముంబైలో లేరు. అయితే ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నాం. కొంతమంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడుతున్నాను. త్వరలోనే మా ఎమ్మెల్యేలంతా తిరిగి వస్తారు. షిండేను ఉపయోగించుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చివేయాలని కొంతమంది చేస్తున్న ప్రయత్నాలు ఫలించవు. ఆయన పార్టీకి నమ్మకమైన నేత. బాలా సాహెబ్ సైనికుడు’ అని రౌత్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ పై రౌత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలలో కొంతమంది తిరిగి రావాలని కోరుకుంటున్నారని అయితే వారిని బలవంతంగా అక్కడ నిర్బంధించారని ఆరోపించారు.
