మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, శివసేన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు.
మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం, శివసేన ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్ట్ సంచలన తీర్పు వెలువరించింది. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం ఉద్దవ్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. అయితే షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమిస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం స్పష్టం చేసింది.
సుప్రీంకోర్ట్ తీర్పుపై బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. ఇది ప్రజాస్వామ్య విజయంగా ఆయన అభివర్ణించారు. శివసేన- బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా , రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని ఫడ్నవీస్ స్పష్టం చేశారు. అలాగే ఏక్‌నాథ్ షిండేను, తనను రాజీనామా చేయాలన్న మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ వర్గం నేత ఉద్ధవ్ థాక్రేపై ఫడ్నవీస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతికత గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలిచిన శివసేన.. సీఎం పదవి కోసం కాంగ్రెస్, ఎన్సీపీలతో ప్రయాణం సాగించిందని దుయ్యబట్టారు.
Also Read: Supreme Court: మహారాష్ట్రలో ఎవరి ప్రభుత్వం ఉంటుంది? బీజేపీ.. ఎన్సీపీ దోస్తీ వదంతులకు ఫుల్‌స్టాప్?
కాగా.. మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి సుమారు 15 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలపడం అప్పుడు సంచలనమైంది. ఉద్ధవ్ ఠాక్రే బీజేపీతో కలవాలని లేదంటే.. తాము బీజేపీలో కలుస్తామని అల్టిమేటం విధించారు. వారు బీజేపీ రాష్ట్రాలకు చెక్కేయడం, గవర్నర్ ఫ్లోర్ టెస్ట్‌కు పిలుపునివ్వడం, ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడం, ఆ తర్వాత బీజేపీతో తిరుగుబాటు ఎమ్మెల్యేలు చేతులు కలపడం చకచకా జరిగిపోయాయి.
తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని శివసేన అప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం విచారించి ఈ రోజు తీర్పు వెల్లడించింది. తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలకు ఎలాంటి గుర్తింపు లేకున్నా.. ఆ నేతల్లో ఒకరికి విప్ అప్పగించడం స్పీకర్ చేసిన తప్పు అని, పార్టీ అంతర్గత సమస్య అని తెలుస్తున్నా ఫ్లోర్ టెస్టుకు ఆదేశించడం గవర్నర్ తప్పు అంటూ సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తప్పులున్నప్పటికీ ఫ్లోర్ టెస్టును ఎదుర్కోకుండా రాజీనామా చేసినందున ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించలేమని స్పష్టం చేసింది.
