Maharashtra Crisis: మ‌హారాష్ట్ర సంక్షోభం ముగిసింది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న‌ట్టు అధికారంగా రాజీనామా పత్రాన్ని రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించారు.

Maharashtra Crisis: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తన పదవికి రాజీనామా చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి గురువారం అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించిన కొద్ది నిమిషాలకే ఉద్ధవ్ థాకరే.. తాను మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంత‌రం ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న‌ట్టు అధికారంగా రాజీనామా పత్రాన్ని రాజ్ భవన్‌లో రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి సమర్పించారు.

ఫ్లోర్ టెస్ట్‌పై స్టే ఇవ్వడానికి ఎస్సీ నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తాను నాటకీయంగా వచ్చానని, అదే తరహాలో నిష్క్రమిస్తున్నానని ఉద్ధవ్ అన్నారు. తనకు నంబర్ గేమ్‌పై ఆసక్తి లేదని, ఫ్లోర్ టెస్ట్‌కు ముందే రాజీనామా చేశానని ఉద్ధవ్ చెప్పాడు. ఉద్ధవ్ ఠాక్రే తన రాజీనామాను ఫేస్‌బుక్ లైవ్ లో ప్రకటించారు. నేను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నానని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. త‌న ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగం

సుప్రీంకోర్టు ఎదురుదెబ్బ తర్వాత ఫేస్‌బుక్ లైవ్ తో ప్రసంగించిన ఉద్ధవ్ ఠాక్రే.. "నేను ఊహించని రీతిలో అధికారంలోకి వచ్చాను. అదే పద్ధతిలో వెళ్తున్నాను, నేను శాశ్వతంగా వెళ్లను, నేను ఇక్కడే ఉంటాను. మ‌రోసారి శివసేన భవన్‌లో కూర్చుంటాను. ప్రజలకు చేరువలో ఉంటాను.నేను సీఎం పదవికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నాను. నాకు మద్దతిచ్చినందుకు ఎన్‌సిపి, కాంగ్రెస్ నేత‌ల‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మేము అధికారికంగా ఔరంగాబాద్‌ను శంభాజీ నగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మార్చాం.. - బాలాసాహెబ్ థాకరే పేరు పెట్టబడిన నగరాలకు మేము అధికారికంగా పేరు మార్చాము" అని ఉద్ధవ్ ఫేస్‌బుక్ లైవ్ ప్రకటనలో తెలిపారు.

సోషల్ మీడియా ప్రసంగం ముగిసిన వెంటనే.. ఉద్ధవ్ ఠాక్రే.. రాజ్ భవన్‌కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీకి తన రాజీనామాను సమర్పించారు. ఈ క్రమంలో ఆయ‌న వెంట అతని భార్య రష్మీ, మాజీ మంత్రి కుమారుడు ఆదిత్య ఠాక్రే, ఇత‌ర నాయకులు ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత.. ఉద్ద‌వ్ ఠాక్రే.. బాంద్రా ఈస్ట్‌లోని తన నివాసం 'మాతోశ్రీ'కి తిరిగి వచ్చాడు, మార్గమధ్యంలో అనేక ప్రదేశాలలో శివసైనికులు అతనికి మద్దతుగా నినాదాలు తెలిపారు. .

అంతకుముందు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సూర్యకాంత్, జెబి పార్దివాలాతో కూడిన వెకేషన్ బెంచ్ "గవర్నర్ నిర్ణయించినట్లుగా ఫ్లోర్ టెస్ట్‌పై స్టే ఇవ్వడం లేదు" అయితే "రేపటి విచారణ ఈ పిటిషన్ యొక్క తుది ఫలితంపై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు. గురువారం ఉదయం బలపరీక్ష నిర్వహించాలని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించడాన్ని శివసేన సుప్రీంకోర్టులో సవాలు చేసింది.