Maharashtra crisis: 38 మంది రెబల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల భద్రతను దురుద్దేశపూర్వకంగా ఉపసంహరించుకున్నారని ఆరోపిస్తూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే, హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్, డీజీపీ రాజ్‌నీష్ సేథ్‌లతో పాటు, రాష్ట్రంలోని పోలీసు కమిషనర్లకు ఏక్‌నాథ్ షిండే లేఖ రాశారు.
Maharashtra crisis-Shiv Sena Balasaheb: మహారాష్ట్ర సంక్షోభం మరింతగా ముదురుతోంది. రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం కాకరేపుతున్నాయి. శివసేన నాయకుడు ఉద్ధవ్ థాక్రే గద్దె దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే పలుమార్లు రెబల్ ఎమ్మెల్యేలను హెచ్చరించినా వారు పెద్దగా పట్టించుకోవడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. శివసేన చర్యలకు ధీటుగా ముందుకు సాగుతున్న తీరున రెబల్స్ అడుగులు వేస్తున్నారు. ఏక్‌నాథ్ షిండేతో పాటు మరో 38 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు బీజేపీ పాలిత అసోం రాష్ట్రంలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నారు. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం నాడు తమ బృందానికి 'శివసేన బాలాసాహెబ్' అని పేరు పెట్టారు. ఇది ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన అసెంబ్లీ నుండి అనర్హత వేటు వేయాలని ఒత్తిడి తెచ్చింది. “మా బృందాన్ని శివసేన బాలాసాహెబ్ అంటారు. మేం ఏ పార్టీలోనూ విలీనం కాబోము’’ అని శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యే దీపక్ కేసర్కర్ అన్నారు.
ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే మహారాష్ట్రలో ఇప్పట్లో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చేలా కనిపించడం లేదు. ఎందుకంటే తిరుగుబాటు ఎమ్మెల్యేల వైఖరి రోజురోజుకూ పదును పెడుతోంది. ప్రస్తుతం అందుతున్న మీడియా కథనాల ప్రకారం.. ఏక్‌నాథ్ షిండే సమావేశంలో తిరుగుబాటుదారులు తమ వర్గం పేరును కూడా నిర్ణయించారు. శివసేన- బాలాసాహెబ్ థాక్రే అనే ఈ తిరుగుబాటు వర్గాన్ని ఈరోజు సాయంత్రం 4 గంటలకు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా రెబల్ నేత దీపక్ కేసర్కర్ కొన్ని ప్రైవేట్ చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాఉఉ. అలాగే శివసేన ఎన్నికల గుర్తును కూడా కైవసం చేసుకునేందుకు షిండే వర్గం సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ పేరుపై శివసేన నుంచి వ్యతిరేకత కూడా మొదలైంది. బాలాసాహెబ్ థాకరే పేరు తీసుకునే హక్కు ఏక్‌నాథ్ షిండేకు లేదని ఉద్ధవ్ థాక్రే మద్దతుదారులు అంటున్నారు.
శివసేన రెబల్ ఎమ్మెల్యే, మంత్రి ఏక్నాథ్ షిండే వ్యతిరేకత ఆగడం లేదు. మహారాష్ట్రలోని పూణె జిల్లాలో ఏక్‌నాథ్ షిండే మరియు ఆయన కుమారుడు శ్రీకాంత్ షిండే ప్రారంభించిన వైద్య ఆరోగ్య శిబిరానికి శివసైనికుల సెగ తగిలింది. పూణేలో శివసేన కార్యకర్తలు వారిద్దరి ఫోటోలకు నల్లరంగు వేశారు. ఉస్మానాబాద్‌లో కూడా ఏకనాథ్ షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే కార్యాలయాన్ని శివసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు. శివసేన, ఔరంగాబాద్‌కు చెందిన మహావికాస్ అఘాడీ మంత్రి తర్వాత ఎమ్మెల్యే సందీపన్ బుమ్రే కార్యాలయంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో సంక్షోభం రావడానికి బీజేపీనే కారణం అని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, దీంతో తమకు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయంపై దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ ఇది శివసేన అంతర్గత వ్యవహారమని అన్నారు. ఇందులో మా పాత్ర లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయంలో మేం తొందరపడటం లేదు. మేము వేచివున్నాము.. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తున్నాము అని అన్నారు.