Asianet News TeluguAsianet News Telugu

నన్నేవరూ చేర్చుకోవట్లేదు.. ఆక్సిజన్ మాస్క్‌తో కరోనా రోగి నిరసన, చివరికి

మహారాష్ట్రలోని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టిన ఓ 38 ఏళ్ల కరోనా రోగి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. 

Maharashtra Covid Patient Dies Hours After Dharna With Oxygen Mask
Author
Nasik, First Published Apr 1, 2021, 10:32 PM IST

మహారాష్ట్రలోని నాసిక్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట నిరసన చేపట్టిన ఓ 38 ఏళ్ల కరోనా రోగి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. బుధవారం సాయంత్రం బాబా సాహెబ్ కోలే అనే కరోనా రోగి.. ఆక్సిజన్ మాస్కు (సిలిండర్‌కు అనుసంధానించబడిన మాస్కు)తో నాసిక్ నగర పాలక కార్యాలయం వద్ద కుటుంబసభ్యులతోపాటు నిరసనకు దిగాడు.

ఏ ఆస్పత్రి కూడా తనను చేర్చుకోకవడంతో ఆయన ధర్నాకు దిగారు. అయితే ఓ గంట తర్వాత అతడ్ని కార్పొరేషన్ సిబ్బంది.. మున్సిపల్ ఆస్పత్రికి తరలించారు. అయితే బుధవారం అర్ధరాత్రి సమయానికి బాబాసాహెబ్ ఆక్సిజన్ శాతం 40 శాతానికి పడిపోయిందని అతని కుటుంబసభ్యులు తెలిపారు.

సాధారణంగా ఆక్సిజన్ శాతం 95 శాతం లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఈ నేపథ్యంలో ఆరోగ్యం క్షీణించి గురువారం తెల్లవారుజామున ఒంటిగంటలకు బాబా సాహెబ్ తుది శ్వాస విడిచారు. 

కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన రెండు మూడ్రోజుల క్రితం బైట్కో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత అక్కడి నుంచి వేరే ఆస్పత్రికి వెళ్లాడు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి వెళ్లాడు. అయితే అక్కడి సిబ్బంది మెడికల్ కాలేజీలో బెడ్ ఖాళీగా లేదని బాబాసాహెబ్‌కు చెప్పారు.

దీంతో నగరంలోని మరికొన్ని ఆస్పత్రుల్లో తిరిగాడు. అయితే ఎవరూ కూడా అతడిని అడ్మిట్ చేసుకోలేదు. ఆ తర్వాత ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి ఆక్సిజన్ మాస్క్ పెట్టించారు. అయితే, అక్కడ కూడా ఎవరూ పట్టించుకోలేదని బాబాసాహెబ్ భార్య ఆవేదన వ్యక్తం చేశారు. 

మరోవైపు బాబాసాహెబ్ మరణ వార్త స్థానికంగా కలకలం రేపింది. బాధితుడిని చేర్చుకోని ఆస్పత్రులపై చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. పోలీసులు, కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా బాధ్యులను గుర్తించే పనిలో ఉన్నారు.

కాగా, మహారాష్ట్రలో గత కొన్ని వారాలుగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బుధవారం కొత్తగా 40 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన నాటి నుంచి ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముంబైలోనూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios