భారత్‌లో తగ్గుముఖం పట్టినట్లే కన్పించిన కరోనా మహమ్మారి.. ఇటీవల మళ్లీ కోరలు చాస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో పరిస్థితి రోజురోజుకి ఆందోళనకరంగా మారుతోంది. దేశంలో నమోదవుతున్న రోజువారీ కేసుల్లో దాదాపు 65శాతం ఒక్క మరాఠా గడ్డపైనే ఉండటం కలవరపెడుతోంది.

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 35,871 మంది వైరస్‌ బారిన పడగా.. ఇందులో 23,179 కేసులు (64.6శాతం) మహారాష్ట్ర నుంచే ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కొత్త కేసుల్లో 80శాతం కేసులు కేవలం ఐదు రాష్ట్రాల్లోనే వెలుగుచూస్తున్నట్లు తెలిపింది. ఇక దేశంలో ప్రస్తుతం 2,52,364 యాక్టివ్‌ కేసులుండగా.. ఇందులో 1.52 లక్షల క్రియాశీల కేసులు మహారాష్ట్రలోనే ఉండటం గమనార్హం.   

ఇక మరణాల విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 172 మంది కోవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా మహారాష్ట్రలో 84 మంది మరణించారు. రోజువారీ మరణాల్లో 85 శాతం కేవలం ఐదు రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. నిన్న ఒక్కరోజే  పంజాబ్‌లో 35, కేరళలో 13, తమిళనాడులో 8, ఛత్తీస్‌గఢ్‌లో ఆరుగురు మరణించారు.

గడిచిన 24 గంటల వ్యవధిలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదని ఆరోగ్యశాఖ తెలిపింది. రాజస్థాన్‌, అసోం, చండీగఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పుదుచ్చేరి, లక్షద్వీప్‌, సిక్కిం, లఢఖ్, మణిపూర్‌, దాద్రానగర్‌ హవేలీ-డయ్యాడామన్, మేఘాలయా, నాగాలాండ్‌, త్రిపుర, అండమాన్‌ నికోబార్‌ దీవులు, అరుణాచల్‌ప్రదేశ్‌లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు ఒక్క కరోనా మరణం కూడా నమోదుకాలేదు. మరోవైపు భారత్‌లో కరోనా మరణాల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది.