ఇటీవలి కాలంలో ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజాప్రతినిధులు భౌతికదాడులకు దిగుతున్న సంఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి.

కొద్దిరోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమారుడు, ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్ వర్గారియా ఓ అధికారిని బ్యాట్‌తో చితక్కొట్టగా.. తెలంగాణలో ఎమ్మెల్యే సోదరుడు మహిళా ఫారెస్ట్ అధికారిపై దాడి చేయటం వైరల్‌గా మారింది.

తాజాగా మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణా అధికారులతో దారుణంగా ప్రవర్తించారు. కంకావలి వద్ద ముంబై-గోవా హైవేపై ఏర్పడిన  గుంతలను పరిశీలిస్తున్న క్రమంలో ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని ఓ ప్రభుత్వ ఇంజనీర్‌పై బురద పోసి తీవ్రంగా అవమానించారు.

అక్కడితో ఆగకుండా అతనిని బ్రిడ్జికి కట్టేసేందుకు ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారడంతో నితీశ్ రాణా తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా.. నితీశ్ రాణా కాంగ్రెస్ సీనియర్ నేత నారాయణ్ రాణా కుమారుడు.