ముఖ్యమంత్రి సతీమణికి కరోనా వైరస్ పాజిటివ్
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సతీమణి రష్మీ థాకరేకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జలుబు రావడంతో ఆమె కరోనా వైరస్ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆమెకు కరోనా సోకినట్లు తేలింది.
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సతీమణి, సామ్నా దినపత్రిక సంపాదకురాలు రష్మీ థాకరేకు కరోనా వైరస్ సోకింది. పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో ఆమె ముంబైలోని ప్రబుత్వ అధికార నివాసం వర్షా బంగ్లాలో హోం క్వారంటైన్ లోకి వెళ్లారు.
రెండు రోజుల క్రితం రష్మీకి జలుబు చేసింది. దీంతో పరీక్షలు చేయించుకున్నారు. ఆమెకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఆ పరీక్షల్లో తేలింది ప్రస్తుతం రష్మీ థాకరే ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. మందులు వాడుతున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా కొనసాగుతోంది.
మహారాష్ట్ర మంత్రి ధనంజయ్ ముండేకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే.. ఎన్సీపీకి చెందిన ఆయనకు కోవిడ్ 19 సోకడం ఇది రెండోసారి. నిరుడు జులైలో ఆయనకు మొదటిసారి కరోనా వైరస్ పాజటివ్ నిర్ధారణ అయింది.
రెండోసారి తనకు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయిందని, గత కొద్ది రోజులుగా తనను కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని, అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సామాజిక దూరాన్ని పాటిస్తూ జాగ్రత్తగా మసలుకోవాలని ఆయన మరాఠీలో ట్వీట్ చేశారు.
తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని మహారాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కుమారుడు ఆదిత్య ఠాకరే కొద్ది రోజుల క్రితం ప్రకటించారు. ఆయన ఈ విషయాన్ని ప్రకటించిన మూడు రోజులకే ధనంజయ్ ముండేకు కరోనా వైరస్ సోకింది.
తనకు కోవిడ్ లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్నానని, తనకు కోవిడ్ 19 ఉన్నట్లు నిర్ధారణ అయిందని, తనను కలిసినవారంతా పరీక్షలు చేయించుకోవాలని, కోవిడ్ ప్రోటోకాల్ పాటించి, సురక్షితంగా ఉండాలని ఆదిత్య ఠాకరే ట్వీట్ చేశారు.