మహారాష్ట్రలో లాక్‌డౌన్‌పై సీఎం ఉద్ధవ్ థాక్రే సందిగ్థంలో పడ్డారు. లాక్‌డౌన్ ఎన్ని రోజులు పెట్టాలన్న దానిపై టాస్క్‌ఫోర్స్‌తో ముఖ్యమంత్రి చర్యలు జరుపుతున్నారు. రోజు రోజుకి కేసులు విపరీతంగా పెరుగుతుండటంతో 15 రోజులు లాక్‌డౌన్ పెట్టాలని సూచించింది టాస్క్‌ఫోర్స్.

అయితే అన్ని రోజులు లాక్‌డౌన్‌కు ప్రభుత్వం విముఖంగా వున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో పతిరోజూ 50 వేల కొత్త కేసులు నమోదవుతూ వస్తున్నాయి. ఇప్పటికే వారంతపు లాక్‌డౌన్ విధించింది మహారాష్ట్ర ప్రభుత్వం. 

లాక్‌డౌన్ కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యే పేదలు, రోజువారీ కార్మికులు, కూలీల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించింది. కరోనా కారణంగా ప్రభావితమవుతున్న వర్గాలను ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆర్థిక ప్యాకేజీపై చర్చించేందుకు సోమవారం సమావేశం ఏర్పాటుచేశారు.

లాక్‌డౌన్‌ పరిధి, ఎన్ని రోజులు? ఎలా అమలు చేస్తారు? వంటివి త్వరలో ఖరారుచేయనున్నారు. ఆహార ఉత్పత్తి, ఔషధాలు, వ్యాధి నిర్దారణ పరికరాల తయారీ సంస్థలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అకోవిడ్ టాస్క్‌ఫోర్స్, ఆర్ధిక ప్యాకేజీలపై చర్చల తర్వాత సోమవారం లేదా మంగళవారం లాక్‌డౌన్‌పై ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.