మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ముంబై నగర పాలక సంస్థకు రూ. 7 లక్షలు నల్లా బిల్లు బకాయి పడ్డారు.

మలబార్ హిల్స్ ప్రాంతంలో ఉన్న ఫడ్నవీస్ అధికారిక నివాసం ‘‘వర్షా’ బంగ్లా 2001 నుంచి నీటి బిల్లు చెల్లించడం లేదని సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తుకు బృహత్ ముంబై మున్సిపల్ కార్పోరేషన్ సమాధానమిచ్చింది. నాటి నుంచి పెండింగ్ బిల్లు రూ. 7,44,981కి చేరడంతో వర్షా బంగ్లాను ఎగవేతదారుగా ప్రకటించినట్లు పేర్కొంది.

ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో పాటు మంత్రులు సుధీర్ ముంగతివార్, పంకజా ముండే, రామ్‌దాస్ కదమ్ సహా 18 మంది మంత్రుల పేర్లను కూడా బిల్లు ఎగవేతదారుల లిస్ట్‌లో చేర్చినట్లు కార్పోరేషన్ తెలిపింది. మొత్తంగా ముంబైలోని వీవీఐపీల పెండింగ్ నల్లా బిల్లు ఏకంగా రూ. 8 కోట్లపైనే ఉందట.