దేశ రాజకీయాల్లో రానున్న రోజుల్లో మహారాష్ట్రీయులు చక్రం తిప్పడం ఖాయమని ఆ రాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవిస్ అన్నారు. ఇప్పటివరకు కేంద్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించినా అత్యున్నతమైన ప్రధాని పదవిని మాత్రం చేపట్టలేకపోయారు. కానీ వచ్చే 30 ఏళ్లలో ఒకరి కంటే ఎక్కువ మంది ప్రధానులు మహారాష్ట్ర నుండి వుంటారంటూ పడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

మహారాష్ట్రలో జరుగుతున్న 16వ  మరాఠీ సమ్మేళనం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మరాఠాల అభివృద్ది, రాజకీయ చైతన్యం,, అవకాశాలపై  పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఓ విలేకరి మరాఠీల్లో  ఒక్కరు కూడా ఇప్పటివరకు ప్రధాని ఎందకు కాలేదంటూ ప్రశ్నించగా సీఎం అందుకు ఆసక్తికరమైన జవాబు చెప్పారు.

భారత దేశ చరిత్రను చూసుకుంటే యావత్ దేశాన్ని పాలించిన వాళ్లు ఎవరైనా వున్నారంటే వారు మరాఠీలేనని అన్నారు. ఎంతటి అసాధ్యమైన పనినైనా సుసాధ్యం చేసే సత్త మనకు పూర్వీకుల నుండే వచ్చిందని  తెలిపారు. కాబట్టి కేంద్రంలో ఎంతో రాజకీయ ప్రాభల్యం, మంచి నాయకులను కలిగిన మహారాష్ట్ర నుండి 2050 సంవత్సరం లోపు ఒకరి కంటే ఎక్కువ మంది నాయకులు ప్రధానులు అవుతారంటూ పడ్నవిస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.